ఆ విధముగా చిన్నమ్మ సేవలో తరిస్తున్నారు

Update: 2016-12-11 00:18 GMT

ఆల్ ది రోడ్స్ లీడ్స్ టూ రోమ్ అన్న సామెత చందంగా ఉంది తమిళనాట ప్రస్తుత రాజకీయ పరిస్థితి. అన్నా డీఎంకే పార్టీలోని అన్ని శక్తులు, అన్ని గ్రూపులు, అందరు వ్యక్తులు... సమస్తం.. చిన్నమ్మకేసే చూస్తున్నారు. ‘నీవే తప్ప ఇత:పరంబెరగ కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా’ అని విష్ణమూర్తి గురించి గజేంద్రుడు.. గత్యంతరం లేదంటూ ఆరాధించినట్లుగా.. అన్నాడీఎంకేలోని నాయకులందరూ కలిసి పార్టీని ఉద్ధరించడానికి.. నాయకత్వం వహించడానికి మరో దిక్కులేదంటూ చిన్నమ్మను ఆశ్రయిస్తున్నారు. మొత్తానికి శశికళ అనుకున్నది సాధిస్తున్నారు. ఆమె ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవచ్చు, కూర్చోకపోవచ్చు... అది లాంఛనమే. కానీ.. తమిళనాడులో ప్రభుత్వాన్ని శాసించగల అధికార దండాన్ని మాత్రం చేతుల్లోకి తీసుకుంటున్నారు.

తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. శశికళ గేమ్ ప్లాన్ అనుకున్న విధంగానే కదులుతోంది. పన్నీర్ సెల్వం , కేబినెట్ ఇప్పటికీ ఆమెకు విధేయంగానే ఉన్నారు. వారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. అయితే జయలలిత మరణించిన తర్వాత అసంతృప్తి చూపించిన సెంగొట్టయ్యన్ కు మంత్రి పదవి ఆశపెట్టి శశికళ ఊరడించినట్లు సమాచారం. ఇక ఇతరత్రా నాయకులెవ్వరూ ఆమె నేతృత్వాన్ని వ్యతిరేకించి మనగలిగేంతటి వారు కాదు. ఆ నేపథ్యంలో అందరూ ఒకటే పాట పాడుతూ... చిన్నమ్మ భజన చేస్తున్నారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ స్వీకరించాలనే మాటను మీడియా ద్వారా కూడా డిమాండ్ చేస్తూ చిన్న చిన్న నాయకులు కూడా చిన్నమ్మ ప్రాపకం పొందాలని ప్రయత్నిస్తుండడం విశేషం. ఎటూ ఆమె చేతికే పగ్గాలు వెళ్తాయి గనుక.. ముందునుంచే భజన చేసి ప్రసన్నం చేసుకుంటే ఫలితం ఉంటుందని అన్నా డీఎంకే శ్రేణులు ఎగబడుతున్నాయి.

డీఎంకే లో కూడా కదలికలు

మరోవైపు డీఎంకే రాజకీయాల్లో కూడా తాజాగా పెనుమార్పులకు రంగం సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి అధికారాల్ని స్టాలిన్ చేతిలోనే పెట్టేలా పార్టీలో మార్పు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Similar News