సీఎం ను టార్గెట్ చేసిన మాజీ సీఎం

Update: 2016-12-28 10:20 GMT

బీహార్ లో ఆర్టేడీ, జేడీయూల మధ్య సయోధ్య చెడింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఊరంతా ఒకదారి అంటే...ఉలిపికట్టెది ఒకదారి అన్నట్లుంది నితీష్ పరిస్థితి అని ఆయన పరోక్షంగా విమర్శించారు. నోట్ల రద్దు ప్రకటన నుంచి వీరిద్దరి మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఈ ఏడాది నవంబరు 8వ తేదీన ప్రధాని నోట్ల రద్దు ప్రకటన చేశారు. విపక్షాలన్నీ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కాని బీహార్ ముఖ్యమంత్రి మాత్రం మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు. మోడీ నిర్ణయం నల్లకుబేరుల ఆటకట్టిస్తుందని కూడా నితీష్ చెప్పారు. తర్వాత ప్రధాని కూడా తన నిర్ణయాన్ని సమర్ధించినందుకు నితీష్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పారు అయితే ఈ విషయం...లాలూకు రుచించలేదు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయంలో కేవలం ఈగో కారణంగా కొందరు విపక్షాల ఐక్యతను దెబ్బతీస్తున్నారన్నారు. నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన అనేక నిరసన కార్యక్రమాలకు కూడా నితీష్ దూరంగానే ఉన్నారు. బీహార్ లో అధికారపీఠాన్ని పంచుకున్న ఆర్జేడీ, జేడీయూల్లో ఆర్జేడీ మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే....జేడీయూ మాత్రం మద్దతు తెలపడం విశేషం.

Similar News