విద్యార్థులే డ్రగ్స్ స్మగ్లర్లుగా మారి....!

Update: 2018-01-13 12:42 GMT

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా చెలరేగిపోతోంది. ఇతర ప్రాంతాల్లోతయారయ్యే మాదక ద్రవ్యాలను సిటీలోకి పెద్ద ఎత్తున దిగుమతి చేస్తోంది. విద్యార్థులనే టార్గెట్ చేసి మత్తులోకి దించుతోంది. వారి జీవితాలను చిత్తు చేస్తూ తమ వ్యాపారాలకు వారినే పావులుగా మార్చుతోంది. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు.. ఈ ఉచ్చులో కూరుకుపోయి త జీవితాలను జైలుకి అంకితం చేస్తున్నారు. వందల సంఖ్యలో స్టూడెంట్స్ దీనికి బానిసలైన్నారని తెలియడంతో పోలీస్ శాఖలో కలవరం మొదలైంది. మత్తుకు బానిసలైన విద్యార్థుల చిట్టా తీసే పనిలో పడింది.

అనంతపురం నుంచి....

అనంతపురం లో తయారైన జీహెచ్ఎం అనే డ్రగ్స్ ని ఓ ముఠా హైదరాబాద్ కి తరలించింది. ఈ విషయం పసిగట్టిన షాద్ నగర్, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా ఓ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ 8 మంది సభ్యులు పట్టుబడ్డారు. అందులో ముగ్గురు విద్యార్థులు. అనంతపురంలో తయారయ్యేఈ డ్రగ్స్ శివారు ప్రాంతాల్లోకి తరలించి యూనివర్సిటీ విద్యార్థులకు, ఐటి, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అమ్మడం... ఆ డబ్బును దాసరి బాబు అనే వ్యక్తికి అందించాలి. అందుకు వారికి కొంత కమీషన్ వస్తుంది. పట్టుబడిన సురేష్ రెడ్డి, దినకర్, నేతాజీ, ఈ ముగ్గురూ స్టూడెంట్స్. కాలేజిలో, యూనివర్సిటీ లకు డ్రగ్స్ సరఫరా చేయడమే వారి డ్యూటీ. వీరిని విచారించిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు బయట పడ్డాయి. వీరి వ్యాపారంలో చాలా మంది విద్యార్థులు ఉన్నట్లు, వారు దానికి బానిసలు కావడమే కాకుండా, డబ్బు కోసం చిన్న సైజ్ బిజినెస్ మ్యాన్ లుగా మారారని తెలుసుకున్నారు. దీనితో పోలీసులు విషయం ఉన్నతాధికారులకు చేరవేశారు. డ్రగ్స్ దందా సాగే కళాశాలలు, కాలేజ్ ల లిస్ట్ ను సేకరిస్తున్నారు. ఈ దందాలో ఉన్న స్టూడెంట్స్ వివరాలు సేకరించే పనిలో పడ్డారు. పట్టుబడిన 8 మంది సభ్యుల ముఠా నుండి 20 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

యాభై కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం....

ఇదిలా ఉంటే కర్ణాటకలో మూతబడిన ఓ పరిశ్రమలో తయారైన డ్రగ్స్ ని గుట్టుచప్పుడు కాకుండా కారులో తరలిస్తున్న మరో ముఠా ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు సంగారెడ్డి టోల్ గెట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 50 కోట్ల విలువ చేసే మత్తు పదార్ధం స్వాధీనం అయింది. ఇటీవల డిసెంబరు 31వ వేడుకలలో భాగంగా డ్రగ్స్ ను తరలిస్తున్న ముఠాలను పోలీసులు ఛఏజ్ చేసి అరెస్ట్ చేశారు. వారి వద్ద చాకలెట్ రూపంలో ఉన్న మత్తు పదార్ధాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా షాద్ నగర్, రాజేంద్ర నగర్ పోలీసులు చేసిన ఆపరేషన్, డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న 50 కోట్ల మత్తు పదార్ధం చూస్తే హైదరాబాద్ లో దీని వ్యాపారం ఏవిధంగా విస్తరించిందో ఇట్టే అర్ధం అవుతుంది. దీన్ని అరికట్టాలి అంటే పోలీస్, డీఆర్ఐ, నార్కోటిక్ అధికారులు అంతా ఏకమైతే తప్ప సాధ్యం కాదని, కళాశాలల్లో గతంలో యాంటీ ర్యాగింగ్ తరహాలో యాంటీ డ్రగ్స్ కమిటీలు వేస్తే తప్ప పరిష్కారం కాదని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Similar News