‘‘లాలూ మాట్రిమోనీ’’ సూపర్ హిట్!!

Update: 2016-10-22 05:50 GMT

దేశమంతా అమ్మాయిల కొరత పెరిగిపోతోంది.. పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువైపోతోంది.. అలాంటి వారంతా ఇప్పుడు.. పుడితే లాలూ యాదవ్ లాంటి ఇంట్లోనే పుట్టుండాలి ప్చ్.. బ్యాడ్ లక్ అనుకుంటున్నారు. దీనికంతటికీ కారణం లాలూగారి సుపుత్రుడే. పెళ్లికెదిగిన అబ్బాయికి అమ్మాయిని వెతకడమే కష్టమైపోతున్న సమయంలో లాలూ వారి చిన్నబ్బాయి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కు ఏకంగా 44 వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయట.. ఇది ఏ మెట్రిమోనీ సైట్ వాళ్లో చెప్పిన లెక్కలు కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర అధికారులే లాలూ తనయుడికి వచ్చిన పెళ్లి ప్రతిపాదనల గురించి ఒక ప్రకటన చేశారు.

ఈ 44 వేల మందిలో ఈడుజోడు కుదిరేలా, తమ స్థాయికి తగ్గ ఒక అమ్మాయిని తేజస్వి యాదవ్ ఎంచుకున్నా.. మిగతా 43 వేల 999 మందితో లాలూ ఏకంగా ఒక మ్యారేజ్ బ్యూరోనే మెయింటైన్ చేయచ్చు. సైడ్ ఇన్‌కంగా కోట్లకు కోట్లు సంపాదించచ్చు. ఇప్పటికే దేశంలో అత్యంత లాభసాటి అయిన వ్యాపారం మెట్రిమోనీలే. ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన పెళ్లిళ్ల వెబ్ సైట్లు.. లక్షలాది మంది పెళ్లి కాని ప్రసాదుల ఫొటోలతో నిండిపోతున్నాయి.. లాలూ తనయుడికి వచ్చిన ప్రతిపాదనల్లో కొన్నింటిని వీరికి మళ్లించినా.. దేశంలో కొందరికైనా బ్రహ్మచర్యం బాధ తప్పుతుందని అంతా అనుకుంటున్నారు.

ఇంతకీ ఈ ప్రతిపాదనలు లాలూ ఇంటికో, లేక పెళ్లిళ్ల పేరయ్యో తీసుకురాలేదు. ఏకంగా ప్రభుత్వ ఫోన్ నంబరుకే వచ్చేశాయి. రోడ్లు సరిగా లేకపోతే ఫిర్యాదు చేయమని డిప్యూటీ సీఎం తన వాట్సాప్ నంబర్ ఇచ్చాడు. అంతే ఎప్పటి నుంచో తేజస్వి హాండ్సమ్ లుక్ పై కన్నేసిన అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు.. ఆ వాట్సాప్ నంబరుకు తమ పెళ్లి సంబంధాలు పంపేశారు. కొందరు అమ్మాయిలు తమ ఫొటోలు, కొలతల వివరాలు పంపగా.. మరికొందరైతే తమ సోషల్ స్టేటస్.. ఆస్తుల వివరాలు కూడా వాట్సాప్ చేసేశారట. ఆ వివరాలే ఇప్పుడు బయటపెట్టారు బీహార్ అధికారులు.

అయినా చూసే ఓపికుండాలేగానీ.. ఆ 44వేల మందిలో ఒక్కరైనా తేజస్వి యాదవ్ కు నచ్చకపోయుంటారా.. వారిని ఫిక్స్ చేయకపోతారా.. ఆ లక్కీ లేడీ ఎవరనేదే ఇప్పుడు చూడాలి.

Similar News