మూడు రింగుల మధ్యలో ముచ్చటగా అమరావతి

Update: 2016-11-30 14:22 GMT

మెట్రో నగరాలను తలదన్నేలా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్నర్, అవుటర్, రీజినల్ రింగు రోడ్డులు మూడు అంచెలుగా రానున్నాయి. ముచ్చటగా మూడు రింగుల మధ్యలో అమరావతి నగరం కొలువుతీరనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బీజింగ్ తరహాలో రింగ్ రోడ్ల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పిస్తున్నారు.

రాజధాని అమరావతిలో చేపట్టనున్న అంతర, బాహ్య, ప్రాంతీయ వలయ రహదారుల నిర్మాణంపై బుధవారం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. మౌలిక వసతులు కల్పించకుండా రాజధాని ప్రాంతం అభివృద్ధి అసాధ్యమని అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశలవారీగా మౌలికవసతులు కల్పించాల్సిన అవసరం వుందన్నారు. ఇందులో భాగంగా రింగ్ రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రింగ్ రోడ్లు సాగేదిలా..

రాజధాని చుట్టూ మూడు రింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు కొలిక్కివచ్చాయి. ఇన్నర్, ఔటర్, రీజినల్ రింగ్ రోడ్లుగా పిలిచే వీటిని మొత్తం 454.5 కి.మీ మేర నిర్మించాల్సివుంది. 15 కి.మీ పరిధిలో 94.5 కి.మీ. మేర ఇన్నర్ రింగ్ రోడ్డు, 25 కి.మీ. పరిధిలో 150 కి.మీ పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు, 34 కి.మీ. పరిధిలో 210 కి.మీ. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు కానుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల రాజధాని నగరంతో సహా 1,36,000 ఎకరాల ప్రాంతం, ఔటర్ రింగ్ రోడ్డు లోపల 4,73,000 ఎకరాల ప్రాంతం, రీజినల్ రింగ్ రోడ్డు 9 లక్షల ఎకరాల ప్రాంతం కలిగి వుంటుంది.

ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే గన్నవరం విమానాశ్రయానికి రాజధాని ప్రాంతం నుంచి మరింత వేగంగా చేరుకోవచ్చు. ఐఆర్‌ఆర్ కాచవరం, వైకుంఠపురం, పెదపరిమి, తాడికొండ, చినకాకాని, పెదవడ్లపూడి, నూతక్కి, తాడిగడప, ఎనికేపాడు, నున్న, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్తుంది. విజయవాడ నగరంపై రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఐఆర్ఆర్ ఉపకరిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు కోసం మైలవరంలో సొరంగ మార్గం నిర్మించాల్సి వుంది. ఇది ఐదో నెంబర్ జాతీయ రహదారిని కలుపుతూ గుంటూరు, తెనాలి, కంచికచర్ల మీదుగా వెళ్లనుంది.

Similar News