మా భవనాలు మాకిస్తే.. కూల్చేస్తాం...

Update: 2016-10-22 01:17 GMT

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సుధీర్ఘంగా జరిగిన టీఎస్ మంత్రివర్గ సమావేశం ఏపి సెక్రటేరియట్ భవనాలను తెలంగాణకు ఇచ్చేలా గవర్నర్‌ను కోరుతూ తీర్మానం చేసింది. ఇక 6 జిల్లాల పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి సచివాలయ భవనాలను తీసుకోవడం వాటిని కూల్చివేయడానికే కావడం విశేషం.

4గంటల పాటు జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం కీలక అంశాలపై చర్చించింది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్.. తీర్పును లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను హరీష్‌రావు నేతృత్వంలో సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో నలుగురు మంత్రులు సభ్యులుగా, ఆహ్వానితులుగా ఇద్దరు మంత్రులు ఉంటారు

విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పెంచేందుకు కడియం నేతృత్వంలో ఓ సబ్‌ కమిటీ, మత్యసంపద, పాడి పశు సంపద శాతాన్ని పెంచేందుకు తలసాని నేతృత్వంలో క్యాబినెట్ సబ్‌ కమిటీ, ఆరోగ్యశ్రీ,ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిల క్లియరెన్స్‌కు మంత్రి లక్ష్మారెడ్డి నేతృత్వంలోక్యాబినెట్ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇక ప్రజా విజ్ఞప్తుల మేరకు 6 జిల్లాల పేర్లు మార్చింది. మరికొన్ని మార్పులు కూడా చేయనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం తెలిపారు.

ఇక హైదరాబాద్‌లో ఏపి సెక్రటేరియట్‌ భవనాలను తెలంగాణకు ఇవ్వాలని గవర్నర్‌ను కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులివ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. 90రోజుల చైల్డ్‌ కేర్ లీవ్‌ సదుపాయం కల్పించింది. పిల్లలకు 18ఏళ్లు వచ్చేలోపు 6 విడతల్లో ఈ లీవ్‌ తీసుకోవాలని మంత్రివర్గం తెలిపింది.

Similar News