ప్రజావ్యతిరేకతపై కేసీఆర్ ఆరా

Update: 2017-02-15 05:31 GMT

ప్రభుత్వంపై వ్యతిరేకత కన్పిస్తోందా? వరసగా తెలంగాణ జేఏసీ, కాంగ్రెస్, టీటీడీపీ,సీపీఎంలు ప్రజాసమస్యలపై ఆందోళనలకు దిగుతుండటంతో కేసీఆర్ ప్రజల నాడిని పసిగట్టే పనిలో పడ్డారు. ఇందుకు పార్టీ నేతలపై ఆధారపడకుండా జిల్లా అధికారులపై కేసీఆర్ ఆధారపడినట్లు తెలుస్తోంది. ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే తనకు నేరుగా సమాచారమివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు సమాచారం. ఉన్నది ఉన్నట్లు చెప్పమని, లేనిపోనివి కల్పించి అంతా బాగుందని కూడా చెప్పొద్దని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.

కలెక్టర్ల నుంచి నివేదికలు...

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తోంది. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పోతున్నా విపక్ష పార్టీలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయన్నది కేసీఆర్ కు మింగుడుపడటం లేదు. అసలు ప్రజల్లో వ్యతిరేకత నిజంగా ఉందా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నాయో తెలుసుకుని, నిజంగా వ్యతిరేకత ఉంటే దానిని తొలిగించుకునేందుకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తున్నా నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొనడానికి కారణాలను కూడా ఆయన అన్వేషిస్తున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటలిజెన్స్ రిపోర్ట్ ను కూడా తెప్పించుకుంటున్నారు. 31 జిల్లాల కలెక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగానే కేసీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్ ప్రజావ్యతిరేకత పై ఆయన ఆలోచనలో పడ్డారు.

Similar News