పెద్దాయన సూచన భేష్.. సర్కారుకు వినిపిస్తుందా?

Update: 2016-11-12 21:10 GMT

ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తుంటాయి. వాస్తవికమైన ప్రజాసంక్షేమం , స్థిరత్వంతో కూడిన అభివృద్ధి మీద వారికి దృష్టి తక్కువగా ఉంటుంది. ప్రజల దృష్టిని తక్షణం ఆకర్షించగల గిమ్మిక్కుల మీద ఉన్నంత శ్రద్ధ స్థిరమైన పోకడల మీద ఉండదు. ఒక రకంగా ఇప్పుడు నల్లధనం నియంత్రణకు జరుగుతున్న వ్యవహారం కూడా అలాంటి విమర్శల పాలవుతోంది.

పెద్దనోట్ల మార్పిడి, నిషేధం అనేది నల్లధనం నియంత్రణకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని ప్రపంచ ఆర్థిక రంగ మేధావుల్లో ఒకరైన రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రంగరాజన్ సూచన చేస్తున్నారు. ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు ఆయన కేంద్రప్రభుత్వాన్ని బాగానే అభినందిస్తున్నారు. అయితే నల్లధనం కట్టడి చేయడానికి దీనికంటె ప్రధానంగా పన్నుల విధానంలో మార్పు రావడం అవసరం అని రంగరాజన్ సూచిస్తున్నారు.

దేశంలో నల్లధనం లేకుండా ప్రజల్లో స్వచ్ఛందంగా మార్పు రావాలంటే గనుక, పన్నురేట్లను తగ్గించాల్సిన అవసరం చాలా ఉందని రంగరాజన్ సూచిస్తున్నారు. కఠిన నియమనిబంధనలతో పన్నుల విధానం ఉండాలని, తక్కువ పన్ను రేట్లు ఉండాలని, అప్పుడు మాత్రమే ప్రజలు స్వచ్ఛందంగా నల్లధనానికి దూరంగా ఉంటారని రంగరాజన్ అంటున్నారు. నిజానికి ప్రభుత్వ లోపభూయిష్టమైన పన్నుల వ్యవస్థ సామాజిక జీవనంతో పొంతన లేకుండా అడ్డగోలుగా ఉన్నందువల్లనే ప్రజలు నల్లధనం వైపు , అనౌకౌంటెడ్ మనీ వైపు మళ్లుతున్నారనేది కీలకమైన వాదన. ప్రధానికి పెద్ద నోట్ల రద్దు గురించి సలహా ఇచ్చినట్లుగా చెబుతున్న అనిల్ బొకిల్ కూడా.. బ్యాంకు క్రెడిట్ ల మీద పన్ను మీద విదించి, 56 రకాల ఇతర పన్నులను రద్దు చేయాల్సిందిగా సూచించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజలనుంచి పిండుకోవడానికి మాత్రమే చూసే ప్రభుత్వం, ఖచ్చితంగా సొమ్ములొచ్చే ఆదాయ మార్గాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉందా అనేదే ఇక్కడ సందేహం.

Similar News