పీవీ సింధును తమ సొంతం చేసుకున్న ఏపీ!

Update: 2016-10-19 07:21 GMT

పద్మ అవార్డులకోసం తమ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలను ఏపీ సర్కారు సిద్ధం చేసి పంపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒలింపిక్ పతకంతో తెలుగు ఖ్యాతిని దేశదేశాలా చాటిచెప్పిన పీవీసింధు తమ బిడ్డ అని చెప్పుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలూ తెగ తపన పడుతున్నాయి. ఒకవైపు తెలంగాణ సర్కారు ఆమెను ముఖ్యఅతిథిగా ఆహ్వానించి బతుకమ్మ ఆడిస్తోంటే, మరోవైపు ఏపీ సర్కారు పద్మభూషణ్ అవార్డుకు ఆమె పేరును సిఫారసు చేసింది. అలాగే చంద్రబాబునాయుడు సర్కార్.. తమ పార్టీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ పేరును కూడా పద్మభూషణ్ కు సిఫార్సు చేయడం విశేషం. అలాగే రక్షణ సలహాదారు సతీష్‌రెడ్డి, మృదంగ విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు, నృత్య కళాకారిణి ఆనంద శంకర జయంత పేర్లు కూడా పద్మభూషణ్ కు సిఫారసు చేశారు.

ప్రభుత్వం సిఫారసు చేసిన వారిలో పద్మశ్రీ అవార్డులకు ఇంకా డాక్టర్లు విష్ణు స్వరూప్ రెడ్డి, గురువారెడ్డి, సికె దుర్గ, చేనేత నిపుణుడు రమణయ్య, బ్యాడ్మింటన్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇంకా పద్మ అవార్డులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా వార్తలు రాలేదు. అయితే పీవీసింధుకు పేరును తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిపాదించబోతున్నట్లుగా అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. పీవీ సింధు సాధించిన ఘనత దృష్ట్యా ఆమెను తమ బిడ్డగా చెప్పుకోడానికి రెండు రాష్ట్రాలు ఆరాటపడుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News