IPL 2024 : ముంబయి ఇండియన్స్ కు మళ్లీ ఓటమి.. ఇక ఇంటికి పోవడమే మంచిదిగా

ముంబయి ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మరోసారి ముంబయికి ఓటమి ఎదురయింది

Update: 2024-05-01 03:28 GMT

ముంబయికి వరస ఓటములు తప్పడం లేదు. ఈ సీజన్ ముంబయి ఇండియన్స్ కు అచ్చి రాలేదు. కెప్టెన్సీ మార్చడం వల్లనో ఏమో తెలియదు కానీ గెలిచే జట్టు మీద కూడా గెలవలేని పరిస్థితి. బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. ముంబయి ఇండియస్స్ ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు ఇదేనా అనిపించేంత రీతిలో వారి ఆట సాగుతుందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. వరస వైఫల్యాలు ఆ జట్టును పాయింట్ల పట్టికలో మరింత దిగజారుస్తున్నాయి. గెలుస్తుందని అంచనా వేసుకున్న జట్టు మీద కూడా ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు చేతులెత్తేస్తున్నారు.

ప్లే ఆఫ్ కు చేరుకోవడం...
నిన్న జరిగిన ముంబయి ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మరోసారి ముంబయికి ఓటమి ఎదురయింది. వరసగా మూడో సారి అపజయం దక్కింది. ఇక ప్లే ఆఫ్ కూడా చేరుకోవడం కూడా కష్టంగానే మారింది. ముంబయి జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టులో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా ఇలా వరస బెట్టి అవుటయ్యారు. ముంబయి జట్టులో వధేరా 46 పరుగులు, టిమ్ డేవిడ్ 35 పరుగులు చేసి జట్టు పరువు కాపాడారు. సూర్యకుమార్ యాదవ్ కూడా విఫలం కావడంతో ఆ జట్టు 144 స్కోరుకే అవుట్ అయింది.
లక్ష్య సాధనలో...
తర్వాత లక్ష్య సాధనలో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ స్వల్ప స్కోరు మాత్రమే కావడంతో పెద్దగా శ్రమించలేదు. కెప్టెన్ కెఎల్ రాహుల్ 28 పరుగుల చేసి అవుటయ్యాడు. దీపక్ హుడా 18 పరుగులు చేశాడు. పూరన్ పథ్నాలుగు పరుగులు చేశాడు. స్యాయినిస్ నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును పెంచుతూ 62 పరుగులు చేశాడు. దీంతో ముంబయి ఇండియన్స్ పై లక్నో జట్టు నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. ఇంత తక్కువ స్కోరు నమోదు చేసిన ముంబయి జట్టు మాత్రం మరోసారి చతికల పడింది. ముంబయి ఇండియన్స్ జట్టు ఇంత బలహీన ప్రదర్శన గతలో ఏ సీజన్ లోనూ చేయకపోవడంతో ఆ జట్టు ఫ్యాన్స్ డీలా పడింది.


Tags:    

Similar News