పార్టీ పరువు పోకుండా చినబాబు వచ్చారు

Update: 2016-10-06 04:48 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మూడో రోజు శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యారు. తద్వారా తానేదో అసంత్రుప్తితో ఉన్నానంటూ సాగుతున్న ఊహాగానాలకు, ప్రచారాలకు తెరదించే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్యేలు ఆ స్థాయి ప్రజాప్రతినిదులకు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ, కీలక మైన వ్యూహకర్తగానూ ఉన్నప్పటికీ లోకేష్ తొలి రెండు రోజులు రాకపోవడంపై చాలా అనుమానాలు వ్యాపించాయి.

మంత్రి పదవి ఇవ్వడం ఆలస్యం అవున్న నేపథ్యంలో నారా లోకేష్ , తన తండ్రి సీఎం చంద్రబాబు మీద అలక వహించి ఉన్నాడని అందుకే శిక్షణకు కూడా రాలేదని బాగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ప్రభావం చూపించిందో ఏమో గానీ.. చివరిరోజూన మూడో రోజు మాత్రం నారా లోకేష్ వచ్చారు.

ముఖ్యమంత్రి డాష్ బోర్డు, కైజాల యాప్.. లను ఉపయోగించే తీరు తెన్నులు , అవి పనిచేసే విధానం గురించి ప్రజాప్రతినిధులకు వివరించే క్లాసును ఆయన ఆసక్తిగా గమనించారు. అయితే మూడో రోజు శిక్షణలో చంద్రబాబునాయుడు ఉండడం లేదు. ఆయనకు ఇతర ప్రభుత్వ పరమైన కార్యక్రమాలు ఉండడంతో విశాఖపట్నం వెళ్లారు. తన వల్ల పార్టీ ఇమేజికి భంగం కలిగించే ఎలాంటి పుకార్లు రాకూడదనే ఉద్దేశంతో లోకేష్ వచ్చినట్లు తెలుస్తోంది.

Similar News