నోట్ల రద్దు తర్వాత బయటకొస్తున్న జగన్

Update: 2016-11-21 11:06 GMT

8వ తేదీ రాత్రి మోదీ నోట్ల రద్దు గురించి, ప్రకటించిన వేల నుంచి.. ఇప్పటిదాకా మీడియా ముందుకు, కనీసం బాహ్య ప్రపంచం లోకి రాకుండా ఉన్న... ఆ వ్యవహారంపై తన అభిప్రాయం వెల్లడించకుండా ఉన్న ఏకైక ప్రధాన నాయకుడు వైకాపా అధినేత జగన్. అయన మొట్టమొదటిసారిగా మంగళవారంనాడు బయటకు రానున్నారు. ఒక ప్రజాపోరాట కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ అంశంపై ఆయన పోరాటం కొత్త కాదుగానీ నోట్ల రద్దు తర్వాత ఆయన ప్రజల ఎదుటకు రావడం ఇదే ప్రథమం.

తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ వారి ఫార్మాస్యూటికల్ కంపెనీకి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వారి పోరాటానికి జగన్ తొలినుంచి మద్దతు ఇస్తున్నారు. గతంలో అక్కడకు వెళ్లి వారికి మద్దతు తెలిపి వచ్చారు కూడా. ఆయన మంగళవారం నాడు మళ్ల తొండంగికి వెళ్లి అక్కడ దివీస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొని, వారితో ముఖాముఖి చర్చలో పాల్గొంటారు.

జగన్ కేవలం దివీస్ వ్యతిరేక ప్రసంగానికి మాత్రమే పరిమితం అవుతారా? కేవలం అక్కడి ప్రజల ఆందోళనను మాత్రమే పంచుకుంటారా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుభవిస్తున్న నోటు కష్టాల ఆందోళనను కూడా పంచుకుంటారా? ఆ విషయంలో కూడా తన అభిప్రాయాలను వెల్లడి చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన టాపిక్ గా రాజకీయ వర్గాల్లో చర్చగా నడుస్తోంది. జగన్ పార్టీ తరఫున నోటు కష్టాలపై నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే అవన్నీ.. పూర్తిగా కేంద్రానికి సంబందించిన ఈ అంశంలో కూడా ఏ రకంగా చంద్రబాబును ఇరుకున పెట్టి, ఆయన మీద నిందలు వేయాలా అని పనిగట్టుకుని మాట్లాడినట్లుగా ఉన్నదే తప్ప.. నిర్దిష్టమైన విమర్శలు కాదు. అలాంటి నేపథ్యంలో.. ఇక జగన్ ఎలాంటి పోకడ అనుసరించబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారు.. అనేది కీలకంగా ఉంది.

Similar News