నోటు కష్టాలు శృతిమించకుండా చంద్రబాబు జాగ్రత్తలు

Update: 2016-12-13 22:11 GMT

ప్రజలకు నోటు కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ పెన్షనర్లకు తక్షణం సొమ్ము అందుబాటులోకి తేవడం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ గా తీసుకుంటున్నారు. రెండు రోజుల్లోగా పెన్షన్లు మొత్తం చెల్లించి తీరాల్సిందేనంటూ ఆయన బ్యాంకర్లను, అధికార్లను ఆదేశిస్తున్నారు. పెన్షన్లు అందటం లేదన్న ఫిర్యాదులు తనకు విన్పించకూడదని అన్నారు. ఈనెల 9, 10 తేదీల్లో రాష్ట్టంలోని 13 జిల్లాలలో బ్యాంకులకు రిజర్వు బ్యాంకు రూ 1448.40 కోట్లు పంపించిందని ముఖ్యమంత్రి తెలిపారు. వీటిలో ఇందులో 1,220 కోట్లు 2 వేల రూపాయల నోట్లని, 55 కోట్లు రూ.500 రూపాయల నోట్లని తెలిపారు. మిగతా కరెన్సీ అంతా రూ.100,రూ. 50,రూ.20,రూ.10 కరెన్సీ అని తెలిపారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో నగదు చెల్లింపులు, నగదురహిత లావాదేవీలపై బ్యాంకింగ్ రంగ ప్రతినిధులతో మంగళవారం రాత్రి అమరావతి సచివాలయంలో ఆయన సమీక్షనిర్వాహించారు. ప్రజలు ఎలా కష్టాలు పడుతున్నారో బ్యాంకు ఉన్నతాధికారులు తెలుసుకోవాలని కోరారు. నగదు రహిత లావాదేవీలకు సహకరించాలన్నారు.

ప్రజలు ఎలా కష్టపడుతున్నారో తెలుసుకొని బ్యాంకు అధికారులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నెలరోజులు దాటింది. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో ఫోనులో సంభాషిస్తూ ప్రజల్లో సహనం నశించే పరిస్థితికి తీసుకురావద్దని, నగదు పంపిణీ చక్కబరచాలని కోరారు. అవసరమైతే ఈ-పోస్ లాంటి యంత్రాలకోసం ప్రభుత్వ 30 నుంచి 40 కోట్లు వెచ్చించటానికి సిద్ధంగా ఉందని, ఎం-పోస్, ఈ-పోస్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు పెరిగే విధంగా చూడాలన్నారు. ‘నేనూ ఆర్ధిక రంగ నిపుణుడిని కాను. కానీ సామాన్య ప్రజల కష్టాలను అధ్యయనం చేసి, అర్ధం చేసుకుని రోజూ పరిస్థితిని సమీక్షిస్తూ, కష్టాలు తీరే మార్గాన్ని అన్వేషిస్తున్నానని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటికే చౌకధరల దుకాణాల్లో రూపే, ఈ-పోస్ యంత్రాల ద్వారా నగదురహిత విక్రయాలు జరుగుతున్న అంశాన్ని గుర్తుచేస్తూ ఎన్ని స్పైపింగ్ మిషన్లయినా సమకూర్చవచ్చు, పరిస్థితి చక్కదిద్దండి అని ఆయన అధికారులను కోరారు. ప్రస్తుతం నగదురహిత లావాదేవీలు 6.1% ఉన్నాయని, ప్రతి చోటా నగదు రహిత లావాదేవీలు 35% అయినా జరగాలని అన్నారు. మొబైల్ లావాదేవీల ద్వారా 10%, డెబిట్ కార్డుల ద్వారా 15% కి పెంచాలన్నారు. బయోమెట్రిక్ మిషన్లు 1000 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బ్యాంకులు ఖాతాదార్లకు ఇస్తున్న నగదు పరిమితిని క్రమంగా పెంచాలని, ఇంకా వారి సహనాన్ని పరీక్షించవద్దని ముఖ్యమంత్రి బ్యాంకు అధికారులను కోరారు. నగదురహిత లావాదేవీలపై కమిషన్లు తగ్గించుకోవాలని, కమిషన్లు తక్కువ ఉంటేనే ప్రజలు నగదు రహిత లావాదేవీల వైపు మళ్లుతారన్నారు.

Similar News