నోటు కష్టాలపై ప్రణబ్ దాదా స్పందిస్తారా?

Update: 2016-12-16 02:27 GMT

ఢిల్లీలో ఇప్పుడు హై డ్రామా నడుస్తోంది. పార్లమెంటులో మాట్లాడడానికి తమకు అవకాశం ఇవ్వడం లేదు అంటూ నానా యాగీ చేస్తున్న విపక్షాలు ... తరచుగా ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శలు చేయడంకంటె తర్వాతిదశకు వెళ్లాలని తలపోస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తమ కంప్లయింట్లు మొత్తం వినిపించాలని ముచ్చట పడుతున్నారు. ప్రజలు పడుతున్న నోటు కష్టాలపై నివేదించడానికి తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలంటూ 14 పార్టీలకు చెందిన నేతలు కలిసి విన్నవించుకున్నారు. రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా సమస్య మరింత హైలైట్ చేయాలని వారు అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

అయితే ప్రథమ పౌరుని వద్దకు వెళ్లినప్పుడు ఏం జరుగుతుంది? అనేది కీలకాంశం. దేశంలోనే నోట్ల రద్దు వ్యవహారాన్ని తద్వారా నల్లధనాన్ని కట్టడి చేయాలనే సంకల్పాన్ని సమర్థిస్తున్న ప్రముఖుల్లో రాష్ట్రపతి కూడా ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని సమర్థిస్తూ ఆయన వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా నిర్ణయం తీసుకోవడానికి ముందు, తీసుకున్న తర్వాత కూడా.. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రాష్ట్రపతిని కలిసి.. దేశంలో నెలకొన్ని అవాంఛనీయ పరిస్థితుల గురించి.. రాష్ట్ర్రపతితో చర్చించడం కూడా జరిగింది.

ఇలాంటి నేపథ్యంలో జనం కష్టాలు పడుతున్న మాట వాస్తవమే గానీ.. క్రమంగా ఆ కష్టాలు కొలిక్కి వస్తుండగా.. ఇప్పుడు మళ్లీ వ్యతిరేకిస్తున్న విపక్షాలు అన్నీ కలిసి కట్టకట్టుకుని ప్రథమ పౌరుడి వద్దకు వెళ్లి పితూరీ చెబితే ఎంత మేరకు ఉపయోగం ఉంటుందనేది అనుమానమే. నిజానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. వారి విజ్ఞప్తిని ఆలకించి నిర్లిప్తంగా ఊరుకున్నా కూడా గొప్ప విషయమేనని, తిరిగి వారికే క్లాస్ పీకినా ఆశ్చర్యం లేదని పలువురు అంచనా వేస్తున్నారు. సభలో విపక్షాలు రచ్చ చేస్తున్న తీరు, సభ జరుగుతున్న సరళిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా వీరి ఫిర్యాదుకు ఎంత విలువ ఇస్తారో చూడాలి.

Similar News