నేటినుంచి వెలగపూడిలనే చంద్రబాబు కూడా!

Update: 2016-11-30 04:34 GMT

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం బుధవారం నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందించబోతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఒక్కటే ఇక్కడ ఇన్నాళ్లుగా పని పెండింగులో ఉండగా.. తాజాగా.. ఆ పనులు కూడా పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నుంచి పూర్తిస్థాయిలో వెలపూడి సీఎంఓ బ్లాకు నుంచే అన్ని కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలు, ఆయన టెక్నాలజీని వాడుతున్న తీరు, కొత్త పోకడలు ఇత్యాది అంశాలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని హైటెక్ రీతిలో రూపుదిద్దుకున్న వెలగపూడి సచివాలయం లోని సీఎంఓ బ్లాకు బుధవారం నుంచి పూర్తిస్థాయిలో పనిచేయనుంది.

గురువారం నాడు వెలగపూడి సచివాలయంలోని సీఎంఓ లో తొలి కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశం రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు... నోట్ల రద్దు పర్యవసానంగా ఏర్పడిన పరిస్థితులు, జనం పడుతున్న కష్టాలు, అమరావతి నగరంలో కొత్తగా కేటాయింపులు ఇత్యాది అంశాల గురించి కేబినెనట్ చర్చించే అవకాశం ఉంది.

పదేళ్లపాటూ హైదరాబాదు నుంచి పరిపాలన సాగించే అవకాశం ఉన్నప్పటికీ మన నేల మీదనుంచే మన పాలన సాగాలి అనే నినాదంతో ఒక ఉద్యమంలా పనిచేసిన చంద్రబాబు.. విజయవాడకు చాలా త్వరితంగానే మకాం మార్చేసారు. తనకు క్యాంప్ ఆఫీస్ లేని పరిస్థితుల్లో బస్సులోని రాత్రిపూట నిద్రించి పగలు కార్యకలాపాలు నిర్వహించడం దగ్గరినుంచి ప్రారంభించి.. ఇవాళ అత్యంత ఆధునాతనమైన సీఎంవో లోకి ఆయన మారబోతున్నారు. ఇన్నాళ్లలో విజయవాడలోని క్యాంప్ ఆఫీసులు, గొల్లపూడి లోని అధికార నివాసం ఇవన్నీ ఆయనకు కార్యక్షేత్రాలుగానే మారాయి.

నిజానికి అమరావతి నగరానికి ఇప్పటికే అంతర్గత రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. పెద్దస్థాయి రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవడం కూడా జరిగింది. చిన్న రోడ్ల పనులు మొదలైపోయాయి. రోడ్లు మౌలిక వసతుల కల్పన పూర్తయ్యేలోగా, కోర్ కేపిటల్ నిర్మాణానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులను జాప్యం లేకుండా కేటాయిస్తే.. మరో రెండేళ్లలో మళ్లీ మరో సరికొత్త సచివాలయంలో చంద్రబాబునాయుడు కొలువుదీరుతారేమో.

Similar News