దూడ ఏదో గేదెకు తెలియదా.....?

Update: 2017-02-28 09:30 GMT

మధ‌్య ప్రదేశ్‌ పోలీసులకు ఓ చిక్కు వచ్చి పడింది. చోరీ సొత్తు దొరికినా వాటి యజమానులను గుర్తించడం వారికి కష్టమైపోయింది. చివరకు చిత్రమైన పరీక్ష పెట్టి సమస్యను సాల్వ్‌ చేశారు. మనుషులను తమదైన శైలిలో విచారించి నిజాలు రాబట్టడం పోలీసులకు వెన్నతోపెట్టిన విద్యే... అయితే నోరులేని మూగ జీవాల నుంచి వాస్తవాలను రాబట్టడం ఎలా కుదురుతుంది. అలాంటి చిత్రమైన కేసులో కూడా భోపాల్‌లోని అశోకా గార్డెన్ పోలీసులు విజయం సాధించారు. సుభాష్ కాలనీకి చెందిన సందీప్ యాదవ్ అనే వ్యక్తి త నాలుగు రోజుల క్రితం తమ ఐదు గేదెలను దొంగలు అపహరించుకుపోయారంటూ కేసుపెట్టారు.

తల్లి ప్రేమ కదా?

రెండు రోజులు తీవ్రంగా గాలించిన పోలీసులు నఫీస్ (31), సయీద్ (45) అనే ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న గేదెలు తమవేనని యజమాని కూడా గుర్తించాడు. అయితే ఆ గేదెలు అతనివో కాదో నిర్దారించుకోవాలని పోలీసులు భావించారు. అపహరణకు గురైన అన్ని గేదెలు పాలిచ్చే పాడి గేదెలు కావడంతో.. గేదెలన్నిటినీ పోలీసు స్టేషన్‌కి తీసుకొచ్చారు. సదరు యజమాని పశువులను అక్కడికి రప్పించి మిగతా గేదెల్లోకి వీటిని వదిలారు. ఇంతలో పిల్లలను గుర్తించిన గేదెలు దూడలకు పాలివ్వడం మొదలుపెట్టాయి. ఇతర దూడలను దగ్గరకి కూడా రానివ్వలేదు. పరీక్ష విజయవంతం కావడంతో వాటిని యజమానికి అప్పగించారు.

Similar News