దావోస్ సదస్సుకు బాబు

Update: 2017-01-05 08:31 GMT

దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. జనవరి 16 నుంచి 21 వరకు జరిగే సమావేశాలకు ముఖ్యమంత్రితో పాటు ఆర్ధిక మంత్రి యనమల., పరకాల ప్రభాకర్‌తో పాటు మరో పది మంది ఉన్నతాధికారుల బృందం హాజరు కానుంది. బాబు విదేశీ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి లభించాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని అనుమతి కోరుతూ లేఖ రాసింది.

గత నెల దుబాయ్‌ పర్యటన చివరి నిమిషంలో రద్దైంది. నెల్లూరు., ప్రకాశం జిల్లాలకు తుఫాను ముప్పు రావడంతో సిఎం పర్యటన రద్దైనట్లు కథనాలు వచ్చాయి. దీంతో పాటు బాబు పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి లభించలేదనే ప్రచారం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల తరపున అధికారిక హోదాలో విదేశాలలో జరిపే ప్రతి పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతిని మోదీ సర్కారు తప్పనిసరి చేసింది. గతంలో ఇలాంటి పర్యటనలపై కేంద్రం చూసీచూనట్లు వ్యవహరించినా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ., ఆర్ధిక అంశాలతో కూడిన పర్యటనలు కేంద్రం కనుసన్నల్లోనే జరగాలని స్పష్టమైన ఆదేశాలనిచ్చింది. దీంతో చంద్రబాబు దావోస్ పర్యటనకు కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Similar News