తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ వార్

Update: 2016-12-23 08:30 GMT

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ట్రావెల్స్ వార్ మొదలైంది. ప్రయివేటు ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయని....తెలంగాణ ట్రావెల్స్ బస్సులను ఆంధ్రప్రదేశ్ లో అడ్డుకుంటున్నారన్నది ఆరోపణ. ఈ ఆరోపణలు సాక్షాత్తూ అసెంబ్లీలోనే విన్పించాయి. టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడారు. ఏపీకి చెందిన జేసీ బ్రదర్స్ తెలంగాణ ట్రావెల్స్ బస్సులను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులను బెంగళూరుకు వెళ్లకుండా జేసీ అనుచరులు అడ్డుకున్నారని, అన్నీ సక్రమంగా ఉన్నా అధికారుల చేత దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. జేసీ బ్రదర్స్ బస్సులు మాత్రం తెలంగాణ యధేచ్చగా ఎందుకు తిరుగుతున్నాయని గౌడ్ ప్రశ్నించారు. వాటిని నియంత్రించాలని గౌడ్ సర్కార్ ను కోరారు. అయతే గౌడ్ ఆరోపణలకు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా దీటుగానే అనంతపురంలో స్పందించారు. తామెవరి బస్సులను అడ్డుకోలేదని, పర్మిట్లు సరిగా లేకుంటే అధికారులు దాడులు చేస్తారని చెప్పుకొచ్చారు. శ్రీనివాస గౌడ్ ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద రోడ్డు మీద తిరుగుతున్న బస్సుల గొడవ చివరకు అసెంబ్లీకి చేరుకుంది. అయితే పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధన ప్రకారం రాష్ట్రం విడిపోక ముందు తీసుకున్న ప్రయివేటు పర్మిట్లు కాలపరిమితి ముగిసే వరకూ ఉంటాయని, అప్పటి వరకూ ఆ బస్సులు రెండు రాష్ట్రాల్లో తిరిగే అవకాశం ఉంటుందని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు.

Similar News