తిరుపతి సైన్స్ కాంగ్రెస్ ప్రత్యేకతలు అనేకం...

Update: 2016-11-29 23:00 GMT

తిరుపతిలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ ను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి రాష్ట్రప్రభుత్వం అన్ని రకాలుగానూ కసరత్తు చేస్తోంది. దేశంలో మరెక్కడా జరిగి ఉండనంత ఘనంగా తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడానికి అనేక రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణలో కొన్ని కీలక అంశాలు ఈ విదంగా ఉన్నాయి.

- 5 రోజులలో రెండు రోజులు మహిళలకు, బాలలకు ప్రత్యేకంగా ఉమెన్ సైన్స్ కాంగ్రెస్, చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు.

- సైన్స్ కాంగ్రెస్‌ ప్రాముఖ్యతను వివరిస్తూ దేశంలోని కొన్ని ప్రధాన నగరాలలో సన్నాహక కార్యక్రమాలను నిర్వహిస్తరు. ఏపీలో కర్నూలు, విశాఖల్లో ఈ కార్యక్రమాలు పెట్టాలనేది ఆలోచన.

- ముంబై, కలకత్తా, చెన్నయ్, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలలో కూడా నీతిఆయోగ్ ఆధ్వర్యంలో ఏపీలో జరిగే నేషనల్ సైన్స్ కాంగ్రెస్‌పై అవగాహన శిబిరాలు నిర్వహించాలని అనుకుంటున్నారు.

- . ప్లీనరీ సెషన్‌లో ‘సామాజిక అవసరాలు’ అనే మొదటి సబ్ థీమ్‌గా తీసుకున్నారు. ఇందులో ఫుడ్ సెక్యూరిటీ, సోలార్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ, నెక్స్ట్ జనరేషన్ నెట్ వర్క్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, బయో రిసోర్సెస్-ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్, మెథనాల్ ఎకానమీ, రోబోటిక్స్ వంటి అంశాలు వుంటాయి. రెండవ సబ్ థీమ్‌గా బ్లూ ఎకానమి, స్వచ్ఛభారత్, స్మార్ట్ సిటీస్ వంటి జాతీయ ప్రాధాన్యాలను తీసుకున్నారు. మూడవ సబ్ థీమ్‌గా ఆర్థికాభివృద్దికి శాస్త్ర సాంకేతికత అనే అంశాన్ని తీసుకున్నారు. 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి 6 ఉపఅంశాలు ఇందులో వున్నాయి. నాలుగవ సబ్ థీమ్‌గా రానున్న కాలంలో శాస్త్ర సాంకేతికత-ఉన్నత విద్య అనే అంశాన్ని తీసుకున్నారు. ఇందులో నానో టెక్నాలజీ సహా 11 అంశాలను చేర్చారు. ఇక ఐదో సబ్ థీమ్‌గా ‘ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యకలాపాలు’ అనే అంశాన్ని తీసుకున్నారు.

- ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే అతిధులు తిరుపతి చుట్టుపక్కల వున్న పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ప్రత్యేక ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నారు.

- సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా తిరుపతిలో 7 ఎకరాల విస్తీర్ణంలో మెగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. స్పేస్, బయో, నానో, రోబో, ఆక్వా టెక్నాలజీకి సంబంధించిన అంశాలతో ఈ ప్రదర్శన ఏర్పాటుచేస్తున్నారు.

- రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తుండడం విశేషం. దీనికి వీలుగా విద్యాసంస్థలలో సైన్స్ ప్రధానాంశంగా పోటీలు నిర్వహించాలని, విజేతలైన విద్యార్థులు నోబెల్ గ్రహీతలను ప్రత్యక్షంగా కలుసుకుని వారితో తమ సందేహాలు నివృత్తి చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

- సైన్స్ కాంగ్రెస్ 5 రోజుల కార్యక్రమాన్ని రాష్ర్టంలోని విద్యార్థులు తిలకించేందుకు వీలుగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెబ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నారు.

- సైన్స్ కాంగ్రెస్ రిగే 5 రోజులూ కనీసం నాలుగైదు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

- ప్రతిష్టాత్మక సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ చిహ్నంగా తిరుపతిలో వంద ఎకరాలలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం రోజునే సైన్స్ మ్యూజియం నిర్మాణానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది.

- తిరుమలలోని సప్తగిరుల థీమ్‌తో సైన్స్ మ్యూజియం నిర్మాణం జరుగుతుంది. 7 గ్లోబుల ఆకారంలో ఈ సైన్స్ మ్యూజియాన్ని నిర్మిస్తున్నారు. హాంకాంగ్ సైన్స్ మ్యూజియాన్ని స్పూర్తిగా తీసుకున్నారు. దేశంలోనే అతి పెద్ద సైన్స్ మ్యూజియంగా దీన్ని నిర్మాణం జరగనున్నది. ‘బ్రహ్మాండ’ పేరుతో నిర్మాణం అవుతున్న ఈ మ్యూజియానికి తిరుపతిలో ప్రాథమికంగా స్థల ఎంపిక పూర్తిచేశారు.

- రెండొందల ఎకరాలలో భారీ గ్లోబ్ ఆకారంలో 7 కట్టడాలను నిర్మించనున్నారు. ఆథునిక సాంకేతిక విధానాలతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 3డి పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోనున్నామని అధికారులు చెప్పారు.

- మ్యూజియంలో ఓషనోగ్రఫీ, మిస్సైల్ టెక్నాలజీ, బయోలజీ, పురావస్తు పరిశోధన, ప్రాచీన చరిత్ర, అంతరిక్ష, ఖగోళ శాస్త్రాలు, ఆక్వా, మెరైన్, రోబోటిక్స్ తదితర సకల శాస్త్రాల అంశాలు వుంటాయి. లోపలనుంచి నేరుగా తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాటు వుంటుంది. ఇదే భవిష్యత్‌లో మ్యూజియానికి ప్రధాన ఆకర్షణ అవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

- మ్యూజియంలో నిత్యం రోబోటిక్ ప్రదర్శనలు, డైనమిక్ ఈవెంట్స్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్, అబ్జర్వేటరీస్, నాలేడ్జ్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలు జరుగుతాయి.

Similar News