డిఎంకె నేతల ముంబై పయనం

Update: 2017-04-12 04:43 GMT

ఆర్కే నగర్‌ ఉపఎన్నికల్ని కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసిన నేపథ్యంలో తమిళనాడు వైద్య శాఖ మంత్రి విజయభాస్కర్‌పై వేటు వేయాలని డిఎంకె డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుకు ఫిర్యాదు చేసేందుకు డిఎంకె ప్రతినిధి బృందం ముంబై బయల్దేరింది. ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విజయభాస్కర్‌ భారీగా డబ్బు పంచిపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐటీ శాఖ కూడా అతడిని ప్రశ్నించినా సంతృప్తికరమైన సమాధానాలు రాలేదు. దీంతో మరోమారు ప్రశ్నించేందుకు ఐటీ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే చెన్నైతో పాటు పలు జిల్లాల్లో విజయభాస్కర్‌కు చెందిన ఇళ్లు., బంధుమిత్రుల నివాసాల్లో ఐటీ దాడులు జరిగాయి. విజయభాస్కర్‌తో పాటు ఆలిండియా సమతువా మక్కల్‌ కచ్చి నాయకుడు శరత్‌ కుమార్‌ ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. వీరితో పాటు ఏఐడిఎంకే ఎమ్మెల్యే చిట్లపక్కం రాజేంద్రన్‌., ఎంజిఆర్‌ మెడికల్‌ వర్శిటీ వీసీ గీతాలక్ష్మీ ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. ఆర్కేనగర్‌లో భారీగా డబ్బు పంపిణీ జరిగిందని ఐటీ శాఖ నిర్ధారించడంతో అక్కడి ఉప ఎన్నికను రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే విజయ భాస్కర్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిఎంకె గవర్నర్‌ను కోరనుంది.

Similar News