జయ మరణంపై అధికారిక ప్రకటనేది?

Update: 2017-02-21 05:57 GMT

ఎందుకు ప్రకటించలేదు....? ఎన్నో అనుమానాలు ..... ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంటూ మరణించిన జయలలిత మరణంపై అధికారిక ప్రకటన ఎందుకు విడుదల చేయలేదని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ప్రశ్నించారు. డీఎంకే ప్రధాన కార్యాలయములో మాట్లాడిన స్టాలిన్ జయ మరణంపై పలు అనుమానాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్నాదురై, ఎంజీఆర్‌ మరణించినప్పుడు అధికారికంగా ప్రకటనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పన్నీర్‌సెల్వం రాజీనామా నుంచి కూవత్తూర్‌లో ఎమ్మెల్యేలను ఉంచిన వరకు ఏం జరిగిందో అందరికీ తెలుసని, తొమ్మిది నెలలుగా ప్రభుత్వం పనిచేయలేదని ఆరోపించారు. జయలలిత సమాధిపై చేత్తో బలంగా తట్టి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చేసిన శపథాన్ని ఆవేశపూరిత చర్యగా విశ్లేషించారు. అసెంబ్లీలో రహస్య ఓటింగ్‌ నిర్వహించి ఉంటే ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అయి ఉండేవారు కారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 22న నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు స్టాలిన్‌ తెలిపారు. అసెంబ్లీలో తనపై దాడి, ప్రభుత్వం ఒక కుటుంబం చేతిలోకి వెళ్లడానికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ పాల్గొంటాయని చెప్పారు.

Similar News