చినబాబు కదిలితే వెంట మంత్రి ఉండాల్సిందే!

Update: 2016-11-19 04:10 GMT

ఎన్నికల సమయంలో కొందరు నాయకులకు పోలీసులు షాడో పార్టీ అంటూ వెంట ఒక పోలీసు బృందాన్ని ఉంచుతారు. ఆ పోలీసు బృందం సదరు నాయకుడు ఎటు వెళితే, ఆయన వెంట నీడలాగా వెళుతూనే ఉంటుంది. అయితే అలాంటి షాడో పార్టీల ఉద్దేశం వేరు. అచ్చంగా అలాంటి ఉద్దేశం కాకపోయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రల్లో పాల్గొనడానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కదిలారంటే మాత్రం.. ఆయన వెన్నంటి కేబినెట్ మంత్రి ఎవరో ఒకరు ఉండాల్సిందే.

నారా లోకేష్ ఒక్కరే వెళ్లి.. జనచైతన్య యాత్రలు నిర్వహించలేరా? ఆయనతో పాటు సీనియర్లు అయిన మంత్రి కూడా మరొకరు ఉండాల్సిందేనా? అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఇలాంటి షాడో పార్టీల వెనుక మరో వాదన వినిపిస్తోంది.

నారా లోకేష్ ఒక్కరే వెళితే.. సదరు కార్యక్రమాల్లో ప్రోటోకాల్ హడావిడి చేయడానికి వీలుండదు. ఆయన కేవలం పార్టీ ప్రధాన కార్యదర్శి తప్ప.. ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కానప్పుడు ప్రోటోకాల్ హంగామాలు చేయలేరు. చంద్రబాబునాయుడు కొడుకుగా, తనకు కూడా మావోయిస్టుల హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో.. ఆయనకు హై సెక్యూరిటీ ఉంటుంది.

అయితే సెక్యూరిటీ ఏర్పాట్లు వేరు, ప్రోటోకాల్ హడావుడి వేరు. కేవలం నారా లోకేష్ వచ్చాడని ప్రోటోకాల్ హంగామా చేస్తే ప్రభుత్వం అభాసు పాలవుతుంది. అందుకే లోకేష్ పాల్గొనే ప్రతి జన చైతన్య యాత్రకు వెంట ఒక మంత్రి కూడా పర్యటిస్తూ ఉన్నారని పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇదంతా చినబాబు ఠీవి తగ్గకుండా ఉండడం కోసమే అని.. ఒకసారి తమ నేత కేబినెట్ విస్తరణ పూర్తిచేశాడంటే గనుక.. ఇక ఇలాంటి డొంకతిరుగుడు మార్గాలను ప్రోటోకాల్ కోసం ఆశ్రయించాల్సిన హంగామా కూడా ఉండదని వారు అంటున్నారు.

Similar News