చంద్రబాబుకు చేరనున్న ఎమ్మెల్యేల ధిక్కార స్వరం

Update: 2016-10-18 10:29 GMT

విశాఖపట్టణం ఎమ్మెల్యేలు తమ ధిక్కార స్వరాన్ని పార్టీ అధినేతకు వినిపించబోతున్నారు. అది నేరుగా పార్టీ అధినేత మీద అసంతృప్తి వ్యక్తం చేయడం కాకపోవచ్చు గానీ.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలంతా జట్టు కట్టడం, అందరూ కలసి అధికారుల మీద ఫిర్యాదు చేసే మిష మీద.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ రెఫరెండం సీఎం దృష్టికి తీసుకెళ్లాలి అనుకోవడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో కొత్త పరిణామాలను గుర్తు చేస్తున్నాయి. వ్యక్తిస్వామ్యం నడిచే పార్టీలో అధినేత ఇష్టానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడడం అనేది అరుదుగా మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు విశాఖ ఎమ్మెల్యేలు అందుకు పూనుకుంటున్నారు.

సాధారణంగా తెలుగుదేశం పార్టీలో మనకు కనిపించే క్రమశిక్షణ వ్యతిరేకంగా విశాఖపట్టణంలోని ఎమ్మెల్యేలు అందరూ కలిసి మంగళవారం నాడు ఓ సమావేశం పెట్టుకున్నారు. స్థానికంగా అధికారులు తమకు సహకరించడం లేదని, అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, తమకు విలువలేకుండా చేస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. అందరూ కలిసి ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడానికి నిర్ణయించుకున్నారు.

పైకి ప్రకటిస్తున్న కారణం ఇదే అయినప్పటికీ... నిజానికి ఎమ్మెల్యేలు అందరూ తొట్లకొండమీద స్థలాన్ని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమ ప్రమేయం లేకుండానే తొట్లకొండ స్థలాన్ని ఫిలింనగర్ కు ఇచ్చేశారని, దీనికి వ్యతిరేకంగా అందరూ కలిసి రిఫరెండంను ముఖ్యమంత్రికి ఇవ్వడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అయితే తెలుగుదేశం పార్టీలో ఇలాంటి తిరుగుబాటును చంద్రబాబునాయుడు సహిస్తారా? ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా చర్చ జరగడాన్ని అధినేత ఇష్టపడరు. విపక్షాలు విమర్శలు చేసినా సరే.. స్వపక్షం మొత్తం తమ సొంత అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాన్ని సమర్థించాలని చంద్రబాబు కోరుకుంటారు తప్ప.. స్వపక్షంవారే విమర్శలకు దిగడాన్ని సాధారణంగా సహించరు. మరి అలాంటి చంద్రబాబునాయుడు విశాఖ ఎమ్మెల్యేలంతా ముఠాకట్టి ధిక్కారం వినిపిస్తే ఎలా స్పందిస్తారో చూడాలి.

Similar News