చంద్రబాబు కొత్త ఆశ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’

Update: 2016-11-29 13:21 GMT

ఆంధ్రప్రదేశ్‌ను మరోమారు అంతర్జాతీయంగా నిలిపేందుకు తిరుపతిలో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ను ఒక మహదవకాశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిలషిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా రాష్ట్రానికి జాతీయ వ్యాప్తంగా పేరు రావాలనేది ఆయన కోరిక. అందుకు సన్నాహాలు కూడా అదే స్థాయిలో ఘనంగా ఉండాలని ఆశిస్తున్నారు. యంత్రాంగాన్ని మొత్తం ఆ దిశగా పరుగులు పెట్టిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

జనవరి 3 నుంచి 7 వ తేదీ వరకు జరగనున్న 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ కోసం రాష్ట్రానికి మరోసారి జాతీయ, అంతర్జాతీయ అతిధులు వస్తున్నారని, మొత్తం 16 వేల మంది పాల్గొనే అతిపెద్ద కార్యక్రమం కొత్త ఏడాది ఆరంభంలో ఇదేనని చంద్రబాబు మంగళవారం నాడు అధికార్ల సమీక్ష్ సమావేశంలో అన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో జరుగుతున్న ఈ సైన్స్ ఈవెంట్ ఒక అరుదైన కాంబినేషన్‌గా ఆయన అభివర్ణించారు. సైన్స్ కాంగ్రెస్ కోసం జరుగుతున్న ఏర్పాట్లపై మంగళవారం తన కార్యాలయంలో అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ, ఏర్పాట్ల పర్యవేక్షణకు నలుగురు మంత్రులతో కమిటీ వేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కమిటీలో గంటా శ్రీనివాసరావు, పీ నారాయణ, పైడికొండ మాణిక్యాలరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వుంటారు. వివిధ ప్రభుత్వ శాఖలు, సైన్స్ కాంగ్రెస్ నిర్వాహకులతో మంత్రుల కమిటీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఏర్పాట్లను సమీక్షిస్తుందని తెలిపారు. జాతీయస్థాయి కార్యక్రమం కనుక ఏర్పాట్లలో వివిధ విభాగాలకు చెందిన రాష్ట్రస్థాయి అధికారులను భాగస్వాముల్ని చేయాలని సూచించారు. ఇప్పటి నుంచే నిరంతర చర్చలు, సమీక్షలతో ఏర్పాట్లను పరిశీలించాలని కోరారు. తక్షణ అవసరాల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం వెంటనే తిరుపతిలో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇజ్రాయేల్, బంగ్లాదేశ్ నుంచి 9మంది నోబెల్ పురస్కార గ్రహీతలు సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా వస్తున్నారు. వీరికి కేంద్ర మంత్రులకు అమలుచేస్తున్న తరహాలోనే ప్రొటోకాల్ పాటించాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. అలాగే, మలేసియా, బంగ్లాదేశ్, ఐవోరీ కోస్ట్, శ్రీలంక, కెన్యా, మొజాంబిక్, జపాన్, సింగపూర్‌ల నుంచి సైంటిఫిక్ అసోసియేషన్ల ప్రతినిధులు వస్తున్నారు. ఇక జాతీయస్థాయిలో పేరొందిన 200 మంది జాతీయ పరిశోధన శాలలకు చెందిన శాస్త్రవేత్తలు, ఫ్యాకల్టీ మెంబర్లు, పరిశోధకులు, వివిధ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐసర్‌లకు చెందిన కులపతులు, ఆచార్యులు, అధ్యాపకులు మొత్తం 12 వేల మంది హాజరయ్యేందుకు సంసిద్ధత తెలిపారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తున్నారు. ఉమెన్ సైన్స్ కాంగ్రెస్‌కు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌లను ముఖ్యఅతిధులుగా ఆహ్వానించాలని నిర్ణయించారు. చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌కు ప్రత్యేక ఆకర్షణగా అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలలో సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమాలు జరుగుతాయి.

సైన్స్ కాంగ్రెస్ జరిగే 5 రోజులూ తిరుపతికి కొత్త శోభ తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యంగా తిరుపతిలోని అన్ని ప్రధాన రహదారులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు పూర్చి చేసి డిసెంబరు రెండవ వారానికి సిద్ధం చేయాలని చెప్పారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్, విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు, విద్యాసంస్థలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలు, ముఖ్య కూడళ్లను సుందరీకరించాలని తిరుపతి మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అన్ని ప్రధాన ప్రదేశాలలో ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్ తదితర ఏర్పాట్లతో తిరుపతికి కొత్త సొబగులు తేవాలని చెప్పారు. దేశం గర్వించతగ్గ సర్ సీవీ రామన్, శ్రీనివాసరామానుజన్, జగదీశ్ చంద్రబోస్, హర్ గోవింద్ ఖొరానా తదితర శాస్త్రవేత్తల ఛాయాచిత్రాలు అన్ని ప్రధాన కూడళ్లలో వుంచాలని సూచించారు. తిరుపతికే ప్రధాన ఆకర్షణగా వుండే తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి చిత్రాలను కూడా వీరి చిత్రాల పక్కనే వుండాలని చెప్పారు. దీనివల్ల మన ఆధ్యాత్మిక క్షేత్రం వైశిష్ట్యం అంతర్జాతీయంగా మరోసారి ప్రస్ఫుటం అవుతుందని అన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచే విద్యుత్ దీపాల అలంకరణతో తిరుపతి దివ్యక్షేత్రం కాంతులీనాలని, దీనికి టీటీడీ సహకారం తీసుకోవాలని సూచించారు. డిసెంబర్ రెండవ వారంలోగా ఆయా పనులన్నీ పూర్తిచేసి ఇతర ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని చెప్పారు.

సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులకు తిరుమల దర్శనం చేయించి పంపించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సమావేశంలో పాల్గొన్న టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుకు ముఖ్యమంత్రి సూచించారు. అతిధులను సగౌరవంగా ఆహ్వానించి కార్యక్రమం పూర్తయ్యేవరకు వారి బాగోగులు చూసుకుని సాగనంపాలని, దీనికోసం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు చెందిన సీనియర్ ఆచార్యులతో ప్రత్యేకంగా విద్యార్థి బృందాలను ఏర్పాటుచేసుకోవాలని చెప్పారు.

మొత్తానికి సైన్స్ కాంగ్రెస్ ను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించడానికి చంద్రబాబు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఉంది.

Similar News