క్లిక్ తో కోట్లు కొట్టేశాడు

Update: 2017-02-03 04:46 GMT

ఆన్‌లైన్‌ బిజినెస్‌ పేరుతో కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న మోసగాళ్లను ఉత్తరప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా దాదాపు రూ.3,700 కోట్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీనితో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నోయిడాలోని అబ్లేజ్‌ ఇన్ఫో సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీ నడుపుతూ సుమారు ఏడు లక్షల మందిని మోసం చేసినట్లు తెలిసిందని వెల్లడించారు.

డిపాజిట్ తోనే ఎర....

ఏడు లక్షల మంది ఇన్వెస్టర్ల ద్వారా దాదాపు రూ.3,700కోట్లు పెట్టుబడిగా పొందారని చెప్పారు. 'ప్రతి క్లిక్‌కు రూ.5 సంపాదించు' అని చెప్తూ మోసానికి పాల్పడ్డారు. సోషల్‌ట్రేడ్‌.బిజ్‌ పేరుతో వెబ్‌ పోర్టల్‌ నడుపుతూ అందులో సభ్యులవడానికి ఇన్వెస్టర్ల నుంచి రూ.5,750 నుంచి రూ.57,500 దాకా పెట్టుబడి పెట్టించారు. ప్రతి క్లిక్‌కు రూ.5 సంపాదించొచ్చు అని చెప్పి వారిని బుట్టలో వేసేవారని పోలీసులు తెలిపారు.ఇప్పటికే వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.500కోట్లు గుర్తించినట్లు చెప్పారు. నిందితుల ఖాతాలు సీజ్‌ చేశామని తెలిపారు. తరచూ కంపెనీ పేరు మార్చుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారని పోలీసులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో బాధితులు...

సోషల్ ట్రేడ్ బాధితులు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ఉన్నారు. యువత., చిరుద్యోగులు పెద్ద ఎత్తున ఈ బోగస్ ట్రాప్ లో చిక్కుకున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో ఒకరి నుంచి మరొకరు ఈ ట్రాప్ లో చిక్కుకున్నారు. 57వేల రూపాయలు కట్టి నెట్ వర్క్ లో చేరితే., సోషల్ ట్రేడ్ సైట్ లో యాడ్ లు క్లిక్ చేసే వీలుంటుందని ప్రతి క్లిక్ తో డబ్బులు వస్తాయని., కొత్తవాళ్లను చేరిస్తే లక్షల్లో డబ్బు వస్తుందని మభ్య పెట్టే వాళ్ళు. హైదరాబాద్., విజయవాడ తో సహా అన్ని ప్రాంతాల్లో అమాయకంగా డబ్బుకు ఆశపడి డిపాజిట్ లు చేసిన వాళ్ళు లబో దిబో అంటున్నారు.

Similar News