కొత్త జిల్లాలపై ఎక్కుపెట్టిన కోదండాస్త్రం!

Update: 2016-10-17 12:45 GMT

కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని రకాల విమర్శలకు దిగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రొఫెసర్ కోదండరాం మాత్రం మాట్లాడకుండా మౌనం వహించడం అప్పట్లో అధికార తెరాసకు ఒక ఎడ్వాంటేజీగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ తో సమానంగా జనంలో గుర్తింపు ఉన్న ఉద్యమ నాయకుడు కోదండరామ్. రాష్ట్రం సాధించిన తర్వాత.. ఆయన రాజకీయాల జోలికి వెళ్లకుండా తిరిగి తన ప్రొఫెసర్ జాబ్ లోకి వెళ్లిపోయి.. గౌరవం నిలబెట్టుకున్నారు. అక్కడ పదవీవిరమణ చేసి.. తన జీవితాంతం తెలంగాణ కోసమే పాటుపడతానని వెల్లడించారు. రైతు సమస్యలు ఇత్యాది విషయాల మీద తన పోరాటం సాగిస్తున్నారు.

తెరాస ఒక దశలో కోదండరాం ను కాంగ్రెస్ పార్టీ తెర వెనుక నుంచి నడిపిస్తున్నట్లుగా రంగు పులమడానికి ప్రయత్నించింది గానీ.. పాచిక పారలేదు. జిల్లాల ఏర్పాటు సమయంలో ఆయన మౌనంగా ఉండిపోయారు గానీ.. ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చారు.

జిల్లాల కోసం ఎన్ని రభసలు జరిగినా ఆయన పెద్దగా మాట్లాడలేదు కానీ.. తాజాగా మండలాల ఏర్పాటు విషయంలో, గ్రామాలను పంచే విషయంలో ప్రజాందోళనలు శృతిమించి ఆత్మాహుతుల వరకు వెళ్లడం అనేది కోదండరాంను కలచివేసినట్లుంది. మండలాల ఏర్పాటుకోసం ప్రజలు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రావడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఆయన సోమవారం నాడు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మను కలిసి ప్రజల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నదంటూ విజ్ఞప్తి చేశారు.

జిల్లాల ఏర్పాటు కూడా సంతృప్తి కరంగా జరగలేదంటూ కోదండరాం ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. రాష్ట్రంలో నిరంకుశత్వం కారణంగానే ప్రజాందోళనలు పెచ్చుమీరుతున్నాయంటూ కోదండరాం చేసిన వ్యాఖ్యను తెలంగాణ సమాజం తీవ్రంగానే పరిగణిస్తుందనడంలో సందేహం లేదు. మీడియా కేసీఆర్‌కు ఎంత అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ, జిల్లాలు, ప్రత్యేకించి ప్రస్తుతం మండలాల ఏర్పాటు విషయంలో ఆందోళనలు రేగుతుండగా వాటిని ప్రధానంగా ప్రస్తావించకపోతున్నప్పటికీ.. కోదండరాం వంటి వారి మాటలు ప్రజల్లోకి దూసుకువెళ్తాయనడంలో సందేహం లేదు. జిల్లాల ఏర్పాటు తీరు మీదనే రకరకాల అనుమానాలు ఉన్నాయని, నోటిఫికేషన్ లో ఇచ్చింది ఒకటి.. తీరా ఏర్పాటు చేసింది మరొకటిగా చేశారని.. కోదండరాం అన్నారు. ఆందోళనలు చేసేవారు ముఖ్యమంత్రితో నేరుగా తమ వేదన చెప్పుకునే వెసులుబాటు ఉండాలని కోదండరాం కోరుతున్నారు. మరి కేసీఆర్ ఈ మాటల్ని చెవిన వేసుకుంటారో లేదో!

Similar News