ఆక్వా కష్టాల మీద దృష్టి పెడుతున్న పవన్ దళం

Update: 2016-11-22 06:47 GMT

భీమవరం వద్ద గోదావరి ఆక్వా పార్క్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళనలకు తన మద్దతు పూర్తిగా ఉంటుందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇదివరకే ప్రకటించారు. అక్కడినుంచి హైదరాబాదుకు పిలిపించిన ప్రజలతో ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆయన దానిని ఖండించారు. వీలును బట్టి తాను క్షేత్రస్థాయికి వస్తానని, వారి పోరాటంలో ప్రత్యక్షంగా పాలు పంచుకుంటానని కూడా చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ స్వయంగా రావడం లేదు గానీ... ఆయన తరఫున జనసేన దళం మాత్రం.. ఆక్వాపార్క్ మీద వాస్తవాలు తెలుసుకునేందుకు మంగళవారం నాడు ఆ ప్రాంతంలో పర్యటించబోతోంది.

జనసేన పార్టీకి చెందిన , పవన్ కల్యాణ్ కు సలహాలు ఇవ్వగల మేథో బృందానికి చెందిన నిపుణులు కొందరు ఆక్వాపార్క్ ను వ్యతిరేకిస్తున్న ప్రజలను ఇవాళ కలుస్తారు. ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ప్రజల నుంచి, ఆందోళనలు చేస్తున్న వారినుంచి వాస్తవాలను తెలుసుకుంటారు. వీరు సమీకరించిన వివరాలతో పవన్ కల్యాణ్ కు నివేదిక అందజేస్తారని సమాచారం.

తన జనసేన దళం ఇచ్చే నివేదికను బట్టి ఆక్వాపార్క్ కు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ తన తదుపరి కార్యచరణను నిర్ణయించుకుంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వారితో కలిసి హైదరాబాదులో పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిన నాడే.. తన అభిప్రాయాన్ని ఉభయ తారకంగా చెప్పారు. పారిశ్రామికీకరణకు తాను వ్యతిరేకం కాదని, పరిశ్రమలు రాకుండా ఉపాధి అవకాశాలు కూడా రావని, అయితే దానిని వ్యతిరేకిస్తున్న ప్రజల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఆందోళనలు చేస్తున్న వారి మీద పోలీసు కేసులు పెట్టడం తగదని మాత్రమే అన్నారు. అయితే.. తాజాగా ఆయన బృందం ఎలాంటి నివేదిక ఇస్తుంది.. ప్రత్యక్ష కార్యచరణలోకి ఆయన ఏరకంగా రంగ ప్రవేశం చేస్తారో చూడాలి.

Similar News