కాంగ్రెస్ కు నామం పెట్టడం ఖాయం

Update: 2018-11-01 14:08 GMT

తెలంగాణలో టీడీపీ ఏమి లేదని, చంద్రబాబు అక్కడ క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. పబ్లిక్ లో హీరో అని చెప్పుకోడానికి సీఎం తంటాలు పడుతున్నారన్నారు. సినిమాల్లో మాదిరి ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కోసం సీఎం ప్రయత్నిస్తున్నారని వ్యంగాస్త్రాలు సంధించారు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అని, పార్టీ అభిమానుల్ని గాయపరిచే నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయులో ఎవరు కలిసినా బీజేపీ ని ఏమి చేయలేరన్నారు. ఐటీ దాడులు అవినీతిపరులు., పన్నులు ఎగవేసిన వాళ్ళ మీద జరుగుతున్నాయని, లంచగొండి తనం మీద ఏసీబీ రైడ్స్ చేస్తుంటే తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. సీఎం అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉంటే ఐటీ రైడ్స్ మీద అభ్యంతరం ఎందుకు చెబుతారన్నారు.

రాజకీయ లబ్దికోసమే......

రాజకీయ లబ్ది పొందడానికి సీఎం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పన్ను ఎగవేత దారుల మీద దాడి చేస్తే వద్దనడం ఏమిటని ప్రశ్నించారు. అవసరం అయితే తిత్లీ తుఫాన్ కూడా కేంద్రం పంపింది అని సీఎం చెబుతారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎన్నికల తరువాత కాంగ్రెస్ కు నామం పెడతారన్నారు. ఆంధ్రాలో ఒక్క సీట్ కూడా ఆ పార్టీకి ఇవ్వరని, టీడీపీ తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు నష్టపోతారని విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. డిసెంబర్ 11న కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పు చేశామని చంద్రబాబు ప్రకటిస్తారన్నారు. అవకాశవాద రాజకీయాలు చేయడంతో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని, కాంగ్రెస్ తో పొత్తు వల్ల టీడీపీకే లాభం.... లేకుంటే తెలంగాణలో ఒక్క సీట్ కూడా రాదన్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం కంటే దారుణం ఇంకొకటి ఉండదని, ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని విష్ణుకుమార్ రాజు అన్నారు.

Similar News