వదంతులతో రెండు ప్రాణాలు బలి

Update: 2018-05-23 14:13 GMT

గ్రామాల్లో ప్ర‌జ‌లు క‌ర్ర‌లు ప‌ట్టుకొని తిర‌గ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు తెలంగాణ‌ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్పష్టం చేశారు. సోష‌ల్ మీడియా పుకార్లు కేవ‌లం వ‌దంతులే అని, పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉన్నారన్నారు. అనుమాన‌స్ప‌ద వ్య‌క్తుల క‌నిపిస్తే డ‌యల్ 100 కు గాని, స్థానిక పోలీసుల‌కు గానీ స‌మాచారం ఇవ్వాల‌ని ఆయన కోరారు. సోష‌ల్ మీడియాలో పుకార్ల కార‌ణంగా తెలంగాణ‌లో రెండు ఘ‌ట‌న‌ల్లో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లా బీంగ‌ల్ ల్లో ఒక ఘ‌ట‌న, రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ ప‌రిధిని బీబీన‌గ‌ర్ లో మరో ఘ‌ట‌న చోటుచేసుకుంది. బీంగ‌ల్ ల్లో మామిడి కాయ‌ల కోసం మామిడి తోటలోకి వెళ్లిన వ్య‌క్తిపై అనుమానంతో దాడి చేశారు. దాడిలో బాలకృష్ణ అనే వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో బాధిత వ్య‌క్తిని పోలీసులు నిజామాబాద్ నుంచి గాంధీ అసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ బాల‌కృష్ణ ప్రాణాలు విడిచాడు. బీబీనగర్ లో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ప్రయాణమైన క్ర‌మంలో ఉన్న వ్యక్తిపై స్థానిక యువకలు దాడి చేశారు. అతనిని వివ‌రాలు వాకబు చేస్తున్న క్ర‌మంలో మ‌ద్యం మ‌త్తులో స‌రైన స‌మాధానం చెప్ప‌కపోవ‌డంతో విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడికి దిగారు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డ స‌ద‌రు వ్య‌క్తి అక్క‌డిక్క‌డే ప్రాణాలు విడిచాడు. ఇలా సోష‌ల్ మీడియా తీసుకొస్తున్న పుకార్ల కార‌ణంగా అమాయ‌కులు కొంత మంది ప్రాణాలు కోల్పోగా, చాల మంది తీవ్ర‌గాయాల పాల‌వుతున్నారు.

మారణాయుధాలతో గస్తీ వద్దంటున్న పోలీసులు..

చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసుకుని రెండు ఘ‌ట‌ల్లో ప్రాణాలు పోవ‌డానికి కార‌ణమైన ప‌లువురిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు తెలంగాణ పోలీసులు. ఈ ఘటనల నేప‌థ్యంలో అలర్ట్ అయిన తెలంగాణ పోలీసులు ఇక నుంచి ఎవ‌రూ కూడా నిద్రాహారాలు మానేసి రాత్రి వేళల్లో చేతుల్లో మారణాయుధాల‌తో గ‌స్తీ ఏర్పాటు చేయొద్ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. తెలంగాణలో ఎలాంటి గ్యాంగ్ లు తీర‌గ‌డం లేద‌ని వాట్సాప్ వేదిక‌గా కేవ‌లం పుకార్ల‌ను పుట్టిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు. స‌ద‌రు వాట్సాప్ మెసెజ్ ల‌ను గుడ్డిగా న‌మ్మి ఫార్వార్డ్ చేయవద్ద‌ని పోలీసులు కొరుతున్నారు. ఒక వేళ అలాంటి మెసెజ్ లు ఎవ‌రికైనా వ‌స్తే వెంట‌నే స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేస్తున్నారు

Similar News