సల్మాన్ హత్యకు రెక్కీ ఎలా నిర్వహించారంటే...?

Update: 2018-06-11 03:27 GMT

కండల వీరుడు.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర జరుగుతుందా...? సల్మాన్ ను చంపేందుకు పక్కా రెక్కీ నిర్వహించారా...? అసలు సల్మాన్ ను ఎందుకు చంపాలనుకుంటున్నారు... రెక్కీ ఎక్కడ నిర్వహించారు.. ఎవరు నిర్వహించారు.. బాలీవుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు హర్యానా పోలీసులు వెల్లడించారు. హర్యానా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న కరడు గట్టిన గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రాను ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో సంపత్ నెహ్రా కీలక విషయాలను వెల్లడించాడు. సల్మాన్ ఖాన్ హత్యకు కుట్రపన్నుతున్నట్లు.. ఇందు కోసం రెక్కీ కూడా నిర్వహించాడని పోలీసులు తెలిపారు.

సల్మాన్ ను చంపేందుకు....

కృష్ణజింకలను చంపిన కేసులో సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. అయితే ప్రస్తుతం సల్మాన్ బెయిల్ పై బయటే ఉన్నారు. సల్మాన్ ను చంపేస్తామని బిష్ణోయ్ వర్గం ఆ మధ్య బెదిరింపులకు పాల్పడింది. అందులో భాగంగానే నెహ్రాతో కలిసి సల్మాన్ హత్యకు కొందరు కుట్ర చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే... గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రా వ్యవహారలన్నీ ఇప్పుడిప్పుడే వెలుగుకి వస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో వందల మందికి పైగా బెదిరించి డబ్బులు దండుకున్న సంపత్... ఇప్పుడు సల్మాన్ ఖాన్ ను చంపేందుకు కూడా వెనుకాడట్లేదు. కృష్ణ జింకల కేసులో సల్మాన్ కోర్టుకు వచ్చినప్పుడు చంపేస్తానని సోషల్ మీడియా ద్వారానే బెదిరింపులకు పాల్పడ్డాడు. దందాలు, బెదిరింపులు, కబ్జా వ్యవహారాలన్నంటికీ సోషల్ మీడియానే వాడుకుని సంపత్ నెహ్రా ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తాడు.

ఫ్యామిలీ డీసెంట్.....

ఇంతటి కరడు గట్టిన గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రా ఫ్యామిలీ చాలా డీసెంట్. తండ్రి రాజస్థాన్ కలోడి ప్రాంతంలో పోలీస్ అధికారిగా పనిచేశాడు. గతంలో చండీఘడ్ పోలీసు విభాగంలో సబ్ ఇన్స్ పెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. పంజాబ్ యూనివర్సిటీ పరిధిలోని డీవీఏ కాలేజీ సంపత్ బీఏ పూర్తి చేశాడు. విద్యార్థి దశలోనే ఘర్షణలకు దిగి పోలీస్ రికార్డులకెక్కాడు. జోధ్ పూర్ లో నమోదైన ఓ కేసులో అరెస్టైన సంపత్ కు .. జైలులో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తో పరిచయమై అతడి అనుచరుడిగా మారాడు. కృష్ణ జింకల కేసులో కోర్టుకు హాజరవుతున్న సల్మాన్ ఖాన్ ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. ఆయన్నుంచి అందినకాడికి దండుకోవాలని సంపత్ ను ఆదేశించాడు. అయితే రాజ్ ఘర్ కోర్టు ఆవరణలో అజయ్ అనే ప్రత్యర్థిపై కాల్పులు జరిపిన చరిత్ర ఉండటంతో.. ఈ వార్నింగ్ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. దీంతో సల్మాన్ ఖాన్ జోధ్ పూర్ కోర్టుకు హాజరైన ప్రతిసారి భద్రతను పెంచారు. బిష్ణోయ్ అరెస్ట్ తర్వాత గ్యాంగ్ కు నేతృత్వం వహించిన సంపత్ వాట్సాప్, ఫేస్ బుక్ ల్లో అనేక మందికి వార్నింగ్స్ ఇచ్చేవాడు.

సంపత్ పై దోపిడీ కేసులు.....

వరుస నేరాలు, హత్యలు, బెదిరింపులతో పాటు సంపత్ పై దోపిడీల కేసులు ఉన్నాయి. పోలీసులు ముమ్మరమైన గాలింపు చేపట్టడంతో సంపత్ హైదరాబాద్ కు మకాం మార్చి.. నెలరోజుల క్రితం మియాపూర్ లోని గోకుల్ ప్లాట్స్ లో ఎంబీఏ చదువుతున్న ఇద్దరు విద్యార్థులతో కలిసి నిరుద్యోగిగా చేరాడు. సంపత్ ... హైదరాబాద్ ప్రాంతంలో తిరుగుతున్నట్లు.. హర్యానా పోలీసులు సమాచారం అందించారు. అలర్టైన పోలీసులు రంగంలోకి దిగారు. సంపత్ ప్రధాన అనుచరులతో పాటు అతని గర్ల ఫ్రెండ్ హిసార్ సెల్ ఫోన్లను ట్యాప్ చేయడంతో అతని అచూకీ బయట పడింది. అతను అద్దెకు ఉంటున్న అపార్ట్ మెంట్ సమీపంలో కాపు కాసి పట్టుకున్నారు. నిత్యం సెల్ ఫోన్ ఛాటింగ్, ఫోన్లలో బిజీగా ఉండే సంపత్.. ఓ గ్యాంగ్ స్టర్ అని తమకు తెలియదని.. విద్యార్థులు పోలీసుల విచారణలో వెల్లడించారు.

Similar News