చెక్కు చెదరని సంస్కృతి మనది

Update: 2018-06-07 15:25 GMT

భారతదేశం ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా భావించి, అందరి బాగునూ కోరుకుంటామని, ఇది ఈ దేశ గొప్పదనమని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. నాగపూర్ లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తృతీయ శిక్షా వర్గ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకలు కె.బి.హెగ్డేవర్ స్మారకాన్ని ప్రణబ్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...జాతి, జాతీయత, దేశభక్తి గురించి నా అభిప్రాయాలను పంచుకోవడానికి వచ్చాను. సిల్క్ రూట్, స్పేస్ రూట్ ప్రపంచంతో బారత్ కు వాణిజ్య బంధం ఏర్పరిచాయి. అన్ని రంగాల్లోనూ భారతదేశానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని, ప్రపంచంలోని అనేక దేశాలకు మనం మార్గదర్శకులుగా నిలిచామని పేర్కొన్నారు. 5000 ఏళ్ల నిరంతర దాడులు, పరాయి పాలన తర్వాత కూడా మన సంస్కృతి చెక్కు చెదరలేదన్నారు. ఇది భారతదేశ గొప్పదనమని పేర్కొన్నారు. భారతదేశానికి స్వతంత్రం కానుక కాదని, పోరాడి సాధించుకున్నదని పేర్కొన్నారు. జాతీ, జాతీయ అనే భావన ఐరోపా కంటే ముందే భారత్ లో ఏర్పడిందని గుర్తు చేశారు. సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశాన్ని ఒక్కటి చేసిన సర్దార్ పటేల్ కు ధన్యవాదాలు చెప్పారు. భారతదేశం అంటే ఒక భాష, ఒక మతంగా ఎప్పటికీ ఊహించుకోలేమన్నారు. భిన్న భాషలు, భిన్న సంస్కృతులు మన దేశాన్ని గొప్ప స్థానంలో ఉంచాయన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ పరుగులు పెడుతుందని, కానీ, సంతోషకరమైన దేశాల జాబితాలో మాత్రం మనం 130వ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. హగ్డేవర్ కి నివాళి ఆర్పించిన తర్వాత అక్కడి విజటర్స్ బుక్ లో హెగ్డేవర్ భారతమాత ముద్దుబిడ్డ అని, ఆయనకు నివాళి అర్పించేందుకు ఇక్కడకు వచ్చానని తన సందేశాన్ని రాశారు.

ప్రణబ్ ముఖర్జీపై ప్రశంసలు

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ..భిన్నత్వంలో ఏకత్వం అనేది ఎన్నో ఏళ్లుగా భరతదేశ పరంపరగా వస్తోందని పేర్కొన్నారు. ఈ గడ్డపై పుట్టిన ప్రతీ ఒక్కరూ భారతీయులేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లోనూ చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ లో పనిచేశారని గుర్తు చేశారు. హిందుత్వం అనే నినాదం సమాజంలో అందరినీ కలపడానికి ఉపయోగపడుతుందన్నారు. సమాజంలో అగ్రభాగాన ఉన్నవారి వెనకే అందరూ నడుస్తారన్నారు. మనలో ఉన్న సంకుచిత మనస్తత్వం వీడి ఏకత్వం సాధించాలని పిలుపునిచ్చారు. కులం, మతం, ప్రాంతం, భాషా వంటి వాటిని మించి దేశం కోసం ఆలోచించే వారే మార్గదర్శకులు అవుతారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డేకర్ ఆలోచనలు మొత్తం దేశ విముక్తి చుట్టే సాగాయని ఆయన గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ స్థాపించిన నాటి నుంచి విశిష్ఠ అతిథులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రణబ్ ముఖర్జీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రణబ్ రాకను వ్యతిరేకించడంలో అర్థం లేదని విమర్శించారు. ప్రణబ్ తో తనకు మంచి స్నేహబంధం ఉందని తెలిపారు. ప్రణబ్ అపార మేధావి, స్నేహశీలి అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో సైద్ధాంతిక వైరుద్యాలున్నా అందరి లక్ష్యం ఒక్కటిగానే ఉండేదని, ఇప్పుడు కూడా రాజకీయ వైరుద్యాలు ఉన్నా అందరి లక్ష్యం మాత్రం దేశ అభివృద్ధి మాత్రమేనని పేర్కొన్నారు.

Similar News