ముందు నుంచి నవ్వు...వెనక నుంచి వెన్నుపోటు

Update: 2018-05-26 12:10 GMT

ఉద్దానం కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టి మూడు రోజుల దీక్ష ముగిసింది. ఆయన ఓ బాలుడి చేతులమీదుగా నిమ్మరసం తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తాను రాజకీయ గుర్తింపు కోసం ముఖ్యమంత్రితో పోరాడటం లేదని, ఒకవేళ అలా అయితే గత ఎన్నికల్లో వారికి ఎందుకు మద్దతు ఇస్తామని ప్రశ్నించారు. పుష్కరాలకు రెండు వేల కోట్లు పెట్టారు కదా, ఆ డబ్బులు ఎటు పోయాయో తెలియదని, ఎవరు తిన్నారో తెలియదన్నారు. కానీ, కిడ్నీ బాధితులను మాత్రం ఆదుకోవడం లేదన్నారు. దశాబ్దకాలంగా 23 వేల మంది మరణించారని, తమకు జబ్బు ఉందని కూడా జనాలకు తెలియని దుస్థితి ఉందన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంటే కనీసం పారిశ్రామికవేత్తలను సమావేశపరిచి వారితో అయినా ఏదైనా సహాయం చేయించండని పవన్ కోరారు.

వెనక్కు నెట్టివేయబడ్డ ప్రాంతం..

20 వేల మందికి కిడ్నీ సమస్య ఉందని తేలితే కేవలం నాలుగువేల మందికి మాత్రమే ప్రభుత్వం పింఛను వస్తోందని. శ్రీకాకుళంలో వెనుకబాటుతనం లేదని, వెనుకకు నెట్టవేయబడిందని జనసేన నమ్ముతుందన్నారు. మీకు అండగా ఉన్న, మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిన మాపై చంద్రబాబు ఇలా చేయడం మంచిది కాదు. ముఖ్యమంత్రి ముందు కౌగిలించుకుని, చిరునవ్వు నవ్వుతారని వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తారన్నారు. ఇలా తాము మోసపోయేవారిమి కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు మీద కోపంతో రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, మేము అన్ని రకాలుగా అన్యాయానికి గురవుతున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుమ్ములాటలో రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ప్రతీ మండలానికి డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్, కిడ్నీ బాధితులందరికీ పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Similar News