బ్రేకింగ్ : నోటిఫికేషన్ విడుదల చేసిన నిమ్మగడ్డ.. సుప్రీ తీర్పు వస్తే?

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. రాజ్యంగ నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరపడం ఎన్నికల [more]

Update: 2021-01-23 04:52 GMT

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. రాజ్యంగ నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరపడం ఎన్నికల కమిషన్ విధి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు ఏదైనా వస్తే దానిని పరిశీలిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా, ఉద్యోగుల భద్రత మేరకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పారు. నాలుగు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో జిల్లా కలెక్టర్లు, ఉద్యోగులు సహకరించాలని కోరారు. తొలివిడతలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా అన్ని జల్లాల్లో ఎన్నికలు జరగుతాయి. పోలింగ్ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మధ్యాహ్నం జరిగే సమావేశంలో పూర్తి స్థాయి ఏర్పాట్లపై సమీక్షిస్తామని చెప్పారు. సీఎస్, డీజీపీతో తనకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సత్సంబంధాలున్నాయి. కానీ పంచాయతీరాజ్ శాఖ మాత్రం మెరుగైన పనితీరును కనపర్చాల్సి ఉంది.

వారిపై చర్యలు తప్పవు….

పంచాయతీ రాజ్ కమిషనర్ సహకరించడం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా వీరు సహకరించకపోవడం బాధాకరమన్నారు. ఈ కారణంగా 2019 ఎన్నికల ఓటర్ల జాబితానే ఎన్నికల కమిషన్ ఆమోదించాల్సి వచ్చింది. 18 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారన్నారు. దీనిపై కమిషన్ సీరియస్ గా ఉందని, త్వరలోనే దీనిపై చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ సోమవారం విచారణకు వస్తుందని చెప్పిన అభిప్రాయం సహేతుకంగా లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.

ప్రభుత్వ సహకారం అవసరం…..

ఎన్నికల నిర్వహణపై భిన్న స్వరాలు విన్పిస్తున్నా వీటి ప్రభావం ఓటర్లపై, అభ్యర్థులపై ఉండదని తాను భావిస్తున్నానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. స్వేచ్ఛగా, న్యాయబద్దంగా ఎన్నికలు జరపాలన్నదే కమిషన్ ధ్యేయమన్నారు. గత రెండున్నరేళ్లుగా అధికారుల నేతృత్వంలోనే స్థానిక సంస్థలున్నాయన్నారు. ఎన్నికల ద్వారానే స్థానిక సంస్థలకు అస్తిత్వం చేకూరుతుందన్నారు. ఎన్నికల సంఘానికి నిధుల కొరత, సిబ్బంది సమస్య ఉందన్నారు. హైకోర్టు ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో ఆశించినంతగా ఫలితాలు లేవని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

ప్రభుత్వానిదే బాధ్యత…..

దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు జరుగుతున్నా ఉద్యోగ సంఘాలు ఇక్కడ ఎన్నికలు వద్దనడం సబబుకాదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఉద్యోగులు ఎన్నికలకు సహకరించాలని కోరారు. ఎన్నికలు జరిపే బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవరోధాలు ఏర్పడినా దానికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే వహించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వమే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఆసక్తి ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని పరోక్షంగా ప్రభుత్వానికి సూచించారు. అందరం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు

Tags:    

Similar News