అందరినీ ఏకం చేస్తా.. మోదీని గద్దె దింపుతా..!!!

Update: 2018-11-01 13:29 GMT

జాతీయ స్థాయిలో పార్టీ నేతలందరినీ కలసి ఏకం చేస్తానని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఈరోజు ఢిల్లీవెళ్లిన ఆయన శరద్ పవార్, రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా, అజిత్ సింగ్ లతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారన్నారు. చరిత్రలో మొదటిసారి ఆర్బీఐలో సెక్షన్ 7ను అమలు చేస్తున్నారన్నారు. మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ దుష్పరిణామాలను ఇప్పటికే అనుభవిస్తున్నామన్నారు. ఎదురు తిరిగితే సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారన్నారు. సుజనాచౌదరి, సీఎం రమేష్ తో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తున్నారన్నారు. తమను బెదిరించడానికే మోదీ ఈ దాడులు చేయిస్తున్నారన్నారు. ఈ దాడులకు తాము ఎందుకు భయపడాలని చంద్రబాబు ప్రశ్నించారు.

దాడులకు భయపడను.....

ఎన్నికలకు ముందు ఇలాంటి దాడులు ఎలాంటి సంకేతాలు ఇస్తాయన్నారు చంద్రబాబు. ఏపీకి ప్రత్యేక హోదా అడిగినందుకే ఈ దాడులు జరుగుతున్నాయన్నది స్పష్టంగా తెలుస్తుందన్నారు. దేశ ఐక్యత కోసం తాను కృషి చేస్తానన్నారు. ఇందిరాగాంధీ నుంచి ఎందరో ప్రధానులను చూశామని, ఇలాంటి ప్రధానిని తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఎక్కువ మంది అధికారులు గుజరాత్ నుంచే ఎందుకు వస్తున్నారన్నారు. చివరకు మోదీ మీడియాను కూడా వదిలిపెట్టడం లేదన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమయం వచ్చిందన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తేవడమే తన లక్ష్యమని చంద్రబాబు వివరించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మాట్లాడిన మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు. ఇలాంటి పరిణామాలు జరుగుతుంటే ఐక్యత ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

తదుపరి సమావేశంలో కార్యాచరణ.....

మరోసారి అన్ని పక్షాల నేతలు సమావేశమై కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఆ సమావేశంలోనే నిర్ణయిస్తామన్నారు. సీబీఐ, ఆర్బీఐ, ఈడీ వంటి సంస్థలను ఎలా కాపాడుకోవాలో చర్చిస్తామన్నారు. అన్ని ప్రభుత్వ వ్యవస్థలను మోదీ భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. అందరం ఐక్యంగా కలసి త్వరలోనే ఉద్యమించనున్నామని చెప్పారు. విపక్ష నేతల నుంచి స్పందన తన పర్యటనలో బాగా వచ్చిందన్నారు. బోఫోర్స్ లో లేని రహస్యాలు రాఫెల్ లో ఎందుకని నిలదీశారు. సేవ్ ది నేషన్..సేవ్ ది డెమొక్రసీ యే తమ నినాదమని చెప్పారు. దేశ ప్రయోజనాలకంటే టీడీపీకి ఏదీ ముఖ్యం కాదన్నారు.

Similar News