టాటా..బైబై..నానో

Update: 2018-07-12 07:14 GMT

పదేళ్ల కింద భారతీయులకు ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే కారును అందించాలనే సంకల్పంతో టాటా సంస్థ నానో కార్లను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. కేవలం రూ.1 లక్షకే కారును మార్కెట్లోకి తెచ్చింది. అయితే, అప్పట్లో ఈ కారుకు కొంత క్రేజ్ ఏర్పడినా క్రమంగా తగ్గతూ వచ్చింది. దీంతో ఈ కారు కొనేందుకు ఎవరూ మొగ్గు చూపలేదు. దీంతో గత నెల కేవలం ఒక్కటి అంటే ఒక్కటే కారును తయారుచేసింది సంస్థ. అదే గత ఏడాది జూన్ లో 275 కార్లను తయారు చేసి, 25 కార్లను మాత్రమే ఎగుమతి చేసింది. ఏడాది తర్వాత ఈ జూన్ లో ఒక్క కారును కూడా ఎగుమతి చేయలేదు.

పదేళ్లకే అంతరించిపోనున్న నానో

2008లో పీపుల్స్ కారు పేరుతో టాటా తీసుకువచ్చిన నానో కారుకు ఇక కాలం చెల్లినట్లే కనపడుతోంది. ఈ కార్ల తయారీని ఆపేయాలని టాటా సంస్థ భావిస్తోంది. డిమాండ్ లేకపోవడంతో ఈ సంస్థ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లే తెలుస్తోంది. కార్లు, ప్యాసింజర్, ట్రక్కులు, మోటర్ సైకిళ్ల రంగాలు భారత మార్కెట్ లో మంచి వృద్ధిని నమోదు చేసుకుంటుండగా, నానో కారు వృద్ధి మాత్రం పూర్తిగా పడిపోవడం గమనార్హం. నానో కారును ఎలక్ట్రికల్ కారుగా తీసుకురానున్నారు అనే ప్రచారం జరిగినా, ఎలక్ట్రికల్ కార్ల తయారీ ధర ఎక్కువ కావడంతో సంస్థ అటువైపు ఆలోచించలేదు. మొత్తానికి సామాన్య, మధ్య తరగతి ప్రజల కోసం వచ్చిన కలల కారు పదేళ్లలో అంతరించిపోతోంది.

Similar News