వీరు నిర్దోషులు...ఎవరు దోషులు?

Update: 2018-04-16 07:00 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడింది. పదహారు మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈ కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఎలాంటి ఆధారాలను చూపక పోవడం వల్ల నిందితులు ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. కేసు దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ... హిందూ రైట్‌ వింగ్‌ సభ్యులు పేలుళ్లకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది. ఈ కేసులో సోమవారం తుది తీర్పు వస్తునన నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు, విచారణ పూర్తి కావడానికి దాదాపు 11 సంవత్సరాలు పట్టింది. మక్కా మసీదులో ప్రార్థనల సమయంలో... 2007 మే 18న పేలుళ్లు జరిగాయి. ఆనాటి ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్ల తర్వాత పాతబస్తీలో చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో 58 మంది గాయపడ్డారు. చికిత్సపొందుతూ వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐయే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మక్కా మసీదు పేలుళ్ల ఘటనపై హుస్సేనీ ఆలం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐయేకి అప్పగించారు. ఈ కేసుతో సంబంధం ఉందన్న అభియోగంపై ఎన్‌ఐయే కొందరు మైనారిటీ యువకులను అరెస్టుచేసి, కోర్టులో చార్జ్‌షీటు వేసింది.

11 మందిపై కేసు నమోదు.....

అయితే కేసు విచారించిన నాపంల్లి ప్రత్యేక న్యాయస్థానం.. మక్కా మసీదు పేలుళ్ల కేసులో వీరికి సంబంధంలేదని తీర్పు ఇవ్వడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు. ఆ తర్వాత మళ్లీ కేసు విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ.. హిందూ రైట్‌ వింగ్‌ సభ్యులు పేలుళ్లుకు పాల్పడినట్టు తేల్చింది. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న స్వామి అసమానంద, లక్ష్మణ్‌దాస్‌ మహరాజ్‌, శ్రీకాంత్‌ పురోహిత్‌ సహా 11 మందిపై ఎన్‌ఐయే కేసు నమోదు చేసింది. అభినవ్‌ భారత్ సంస్థ నిర్వాహకులు స్వామి అసమానంద, లోకేశ్‌శర్మ పేలుళ్లకు కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మరో నిందితుడు జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మొత్తం 226 మంది సాక్షులను విచారించింది. అయితే ఈ పేలుళ్ల కేసులో ప్రాసిక్యూషన్ నేరారోపణలను నిరూపించడంలో విఫలమయిందన్న అభిప్రాయాన్నికోర్టు అభిప్రాయపడింది.

Similar News