హరీష్ రావుతో విభేదాల గురించి చెప్పిన కేటీఆర్

Update: 2018-11-06 09:59 GMT

కాంగ్రెస్ ని ఔట్ సోర్సింగ్ గా తీసుకుని చంద్రబాబు తెలంగాణలోకి చొచ్చుకురావాలని చూస్తున్నారని, కుల రాజకీయాలు ప్రారంభించారని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో కుల రాజకీయాలు లేవని, చంద్రబాబు ప్రయత్నాలు చెల్లవని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్ఠాగోష్ఠిగా పలు కీలక అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నోకొన్ని స్థానాలు కూడా చంద్రబాబుతో పొత్తు కారణంగా రాకుండా పోతున్నాయని పేర్కొన్నారు. కచ్చితంగా 100 స్థానాల్లో కూటమి డిపాజిట్లు కోల్పోతుందని, మజ్లీస్ తెలంగాణలో రెండు అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిశబ్ధ విప్లవం లేదని, డిసెంబర్ 11న కాంగ్రెస్, చంద్రబాబు గూభగుయ్యిమనిపించేలా శబ్ధ విప్లవమే రాబోతుందని పేర్కొన్నారు.

గేట్లు తెరిస్తే రెడీగా ఉన్నారు...

టీఆర్ఎస్ ఒంటరిగా అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని, కాంగ్రెస్ నేతలకు ఈ సవాల్ కి సిద్ధమా అని ప్రశ్నించారు. హరీష్ రావుతో తనకు విభేదాలు లేవన్న ఆయన, రాజకీయం కంటే తమ కుటుంబసభ్యులకు ఉన్న అనుబంధమే గొప్పదన్నారు. మరో 15 ఏళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. ప్రత్యర్థులు ఎవరో తేలనందునే కేసీఆర్ ప్రచారం మొదలు కాలేదని, ప్రత్యర్థులు తేలాక కేసీఆర్ వరుస సభలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో చంద్రబాబుకు ముందు తెలుస్తోందని, పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు కూడా ఇది నచ్చక టీఆర్ఎస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తాము అభ్యర్థులను మారిస్తే 15 మంది దాకా కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరతారని, కానీ అభ్యర్థులను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Similar News