ఇక తడాఖా చూపిస్తా....!!

Update: 2018-12-11 12:12 GMT

తమ విజయం ఎంత ఘనంగా ఉందో... తమపై బాధ్యత కూడా అంతే బరువుగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ టీఆర్ఎస్ కి లభించిన ఘన విజయం పూర్తిగా తెలంగాణ ప్రజల విజయమన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో గర్వం, అహంకారం లేకుండా వినయం, విధేయతతో ప్రజలు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరివ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే కాళేశ్వరం, కూటమిని గెలిపిస్తే శనేశ్వరం వస్తుందని ప్రజలకు చెబితే, కాళేశ్వరమే కావాలని తమకు ఓటేశారన్నారు. తాను సచివాలయం పోవడం లేదన, ప్యాలెస్ కట్టుకున్నానని ఆరోపించిన వారు ఇవాళ మట్టిలో కలిశారన్నారు. తమ పార్టీ వారి తప్పుల వల్లే సుమారు 18 స్థానాలు ఓడిపోయామని, ఉదాహరణకు ఖమ్మంలో తమ పార్టీ వారే ఒకరిని ఒకరు రాజకీయంగా చంపుకున్నారన్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు టీఆర్ఎల్పీ సమావేశం ఉందని, ప్రమాణస్వీకారం గురించి రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు.

పేదరికంపై విజయం సాధిస్తాం...

పొడు భూముల సమస్యలు ఆరు నెలల్లో పరిష్కరిస్తామన్నారు. కులవృత్తులను నిలబెడతామన్నారు. యువతలో ఉపాధికి సంబంధించి ఉన్న బాధ వాస్తవమే, అయితే నిరుద్యోగ సమస్య కేవలం తెలంగాణలోనే ఉన్నది కాదని, ఉద్యోగ ఖాళీలను అత్యంత వేగంగా భర్తీ చేస్తామన్నారు. సశ్యశామల తెలంగాణ, శాంతియుత తెలంగాణగా మార్చుకుంటామన్నారు. దళితులు, గిరిజనుల పేదరికం పోవడానికి ప్రయత్నిస్తామన్నారు. పేదరికం కేవలం కులానికో, మతానికో పరిమితం కాదని, పేదలు ఎవరైనా పేదలే కాబట్టి అగ్రవర్ణ పేదలను కూడా ఆదుకుంటామని పేర్కొన్నారు. ఒక్క బూత్ లో కూడా రీపోలింగ్ జరగకుండా దేశానికి ఆదర్శంగా తెలంగాణలో ఎన్నికలు జరిగాయన్నారు.

దేశ రాజకీయానికి దిక్సూచి చూపిస్తాం....

చైతన్యవంతమైన తెలంగాణ గడ్డ దేశ రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దేశానికి తెలంగాణ ఒక దిక్సూచి అని, దేశ రాజకీయ వ్యవస్థకు ఒక కొత్త మార్గం చూపిస్తామన్నారు. కచ్చితంగా ఈ దేశం కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వం రావాలన్నారు. ఈ దేశానికి 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా... 30 వేల టీఎంసీల నీటినే వాడుకున్నందుకు సిగ్గుపడాలన్నారు. దేశానికి ఒక కొత్త ఆర్థిక, వ్యవసాయ వసస్థ కావాలని పేర్కొన్నారు. ఇజ్రాయిల్, చైనాతో పోల్చుకుంటే మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాలన్నారు. దేశంలో 15 కోట్ల మంది రైతులు ఉన్నారని, వారి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. త్వరలోనే ఢిల్లీ వెళతామనని ప్రకటించారు. 73 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజలకు కనీసం శుద్ధమైన తాగునీరు ఇవ్వలేకపోవడం సిగ్గుపడాల్సిన అంశమన్నారు. నెలరోజుల్లోనే దేశంలో అద్భుతమైన గుణాత్మక మార్పును చూస్తామని స్పష్టం చేశారు.

Similar News