బ్రేకింగ్: ఆనాడే సోనియా ఆ పనిచేసి ఉంటే...?

Update: 2018-12-12 12:39 GMT

సోనియా ఆరోజు తాను చెప్పింది చేసి ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఉండేది కాదని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తాను సోనియా దగ్గరకు వెళ్లానని, రాష్ట్రం ఇచ్చినందుకు తాను కృతజ్ఞతలు చెప్పిన తర్వాత టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయాలని వారు కోరారన్నారు. అయితే విలీనం చేయడం వల్ల ఉపయోగం ఉండదని తాను సోనియాకు చెప్పానన్నారు. అయితే దిగ్విజయ్ సింగ్ ను కలవమన్నారని తనకు సోనియా చెప్పారన్నారు. అయితే దిగ్విజయ్ సింగ్ ను కలిస్తే కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా చేస్తే.....

తనను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడినిచేయాలని తాను కోరానన్నారు. అయితే దిగ్విజయ్ సింగ్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఉనికి ఉండదని ఎద్దేవా చేయడంతో తాను 2014 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి గెలిచి చూపించామన్నారు. కాంగ్రెస్ నేతలు తమను ఎన్నో అవమానాలకు గురిచేశారన్నారు. తమ పార్టీలో ఉన్న విజయశాంతి వంటి నేతలను కూడా పార్టీలో చేర్చుకుని తమను అస్థిర పర్చాలని ప్రయత్నించారని చెప్పారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్ ఎందుకు మాట తప్పారో ఆయన మీడియా చిట్ చాట్ లో వివరణ ఇవ్వడం విశేషం. మరోసారి గెలిచి టీఆర్ఎస్ ఉనికి ఏంటో సోనియాకు చెప్పగలిగామని చెప్పారు.

Similar News