ఉదయం వచ్చి...సాయంత్రానికి....?

Update: 2018-05-18 08:44 GMT

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పూర్తి మెజారిటీ లేకున్నా బీజేపీ తరుపున యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం, బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల సమయం ఇవ్వడంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అప్పటివరకు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్ వైపు చూసింది. హైదరాబాద్ అయితేనే సేఫ్ అని భావించిన ఆ పార్టీలు గురువారం రాత్రి ఎమ్మెల్యేలను బస్సుల ద్వారా హైదరాబాద్ కు తరలించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు కన్నడ ఎమ్మెల్యేలు. మొత్తం 36 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలకు నోవాటెల్ లో బస ఏర్పాట్లు చేశారు. 74 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తాజ్ కృష్ణలో బస చేశారు. ఇందుకు తగ్గట్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి, ఇతర నేతలు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు పెద్దఎత్తున యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ నాయకులు చేరుకున్నారు.

రాత్రికే తిరుగుప్రయాణం....

కాగా, 15 రోజుల పాటు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండేందుకు అన్నీ ఏర్పాట్లు జరిగినా సుప్రీంకోర్టు రేపే బలనిరూపణ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో క్యాంపు ఒక్క రోజుతోనే ముగియనుంది. శుక్రవారం ఉదయమే హైదరాబాద్ చేరిన ఎమ్మెల్యేలు రాత్రికే తిరుగు ప్రయాణం కానున్నారు. వీరు శనివారం నేరుగా బెంగళూరులోని కర్ణాటక విధానసభకు చేరుకోనున్నారు. వీరిని బస్సులు, కార్ల ద్వారా తిరిగి కర్ణాటకకు తరలిస్తున్నారు. పాపం బలప్రదర్శన ఏమోగానీ ఎమ్మెల్యేలకు కనీసం కంటిమీద కునుకు కూడా కరువైంది.

Similar News