ఈస్ట్ ఈసారి బెస్ట్ అట

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు.

Update: 2022-03-25 07:08 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తూనే మరొ వైపు తన పొలిటికల్ కెరీర్ పైన కూడా దృష్టి పెడుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి దారుణంగా ఓటమిపాలయ్యారు. ఆయన ఓటమిని ఏమాత్రం ఊహించలేదు. గాజువాకను పక్కన పెడితే భీమవరంలో తాను తప్పకుండా గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. అయినా రెెండుచోట్ల ఓటమి పాలయ్యారు.

మరోసారి ఆ తప్పు.....
ఈసారి పవన్ ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నారు. పొత్తుల విషయాన్ని పక్కన పెడితే ఈసారి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకు ఈసారి ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గం బలంగా ఉంది. దీంతో పాటు జనసేన ఇక్కడ క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది. అందుకే ఈస్ట్ ను ఈసారి ఎంచుకున్నారని తెలిసింది.
జనసేన బలంగా...
తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం, పిఠాపురంలో ఒక్కదానిలోనే పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గం 2009 లో ఏర్పడింది. 2009లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ గెలిచింది. అప్పటి ప్రజారాజ్యం పార్టీ నేత కన్నబాబు గెలిచారు. 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీ కూటమికి మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ పిల్లి అనంతలక్ష్మి టీడీపీ నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో పవన్ ఒంటరిగా పోటీ చేశారు. ఇక్కడ వైసీపీ తరుపున కన్నబాబు మరోసారి విజయం సాధించారు. జనసేన ఇక్కడ గట్టిపోటీ ఇచ్చింది.
సేఫ్ ప్లేస్....
జనసేనకు మరో బలమైన నియోజకవర్గం పిఠాపురం. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగా గీత విజయం సాధించారు. ఇక్కడ కాపు సామాజికవర్గం గెలుపోటములను నిర్ణయిస్తుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎస్‌వీఎస్ఎన్ వర్మ విజయం సాధించారు. పిఠాపురం అయితే తనకు సేఫ్ ప్లేస్ అని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. మొత్తం మీద ఈసారి పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్, పిఠాపురంలలో ఒకదాని నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.


Tags:    

Similar News