చంద్రబాబుపై జగన్ పంచులు భలే పేలాయ్

Update: 2018-06-26 14:11 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మంగళవారం 199వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శల వర్షం గుప్పించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ...‘తన ప్లాట్లు అమ్ముకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడే రింగ్ రోడ్డు, ఐటీ హబ్, ఎయిర్ పోర్టు, 100 అంతస్థుల భవనం వస్తుందని చెప్పి ప్లాట్లు అమ్ముతాడు. నాలుగేళ్ల తర్వాత చూస్తే పిచ్చి మొక్కలు తప్ప ఏమీ ఉండవు. ఐదో యేడు మళ్లీ ఇంకో వెంచర్ చేసి ప్లాట్లు అమ్మేందుకు మళ్లీ అవే మాటలు చెబుతాడు. ప్రజలు మోసపోతారు. అటువంటి వాడిని మనం నాటుగా 420 అంటాం. నాలుగేళ్లుగా సీఎం గారు కూడా రియల్ ఎస్టేట్ సినిమా చూపిస్తున్నాడు. అదిగో సింగపూర్ లాంటి రాజధాని, పోలవరం, ఐకానిక్ టవర్, ఐకానిక్ బ్రిడ్జి, అదిగదిగో సిలికాన్ వ్యాలీ వస్తోంది. అదిగో బుల్లెట్ రైలు, ఇదిగో హైపర్ లూప్. అక్కడే మైక్రోసాఫ్ట్. అందులో సత్య నాదేళ్లకు చంద్రబాబు ట్యూషన్ చెబుతుంటారు.’ అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై, అమరావతి నిర్మాణంపై జగన్ ఎద్దేవా చేశారు. ‘చిటికేస్తే 20 లక్షల కోట్ల పెట్టుబడులని, జేబులో పెన్ను తీస్తే 40 లక్షల ఉద్యోగాలని చెబుతాడు. రెయిన్ గన్స్ తో కరువును జయించానని, వరుణదేవుడిని ఓడించానని చెబుతాడు.’ అని విమర్శించారు. చంద్రబాబు పాలనలో కనీవినీ ఎరుగని అవినీతిని చూస్తున్నామని, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు తాకట్టుపెట్టారని ఆరోపించారు.

Similar News