ఆరు మ్యాచ్ లు.. ఆరు విజయాలు

శ్రీలంక, న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లు ఆరింటిలోనూ భారత్ అద్భుతమైన విజయం సాధించింది.

Update: 2023-01-25 03:29 GMT

భారత్ స్వదేశంలో సత్తా చాటుతుంది. ఇటీవల కాలంలో శ్రీలంక, న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లు ఆరింటిలోనూ భారత్ అద్భుతమైన విజయం సాధించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతి మ్యాచ్ లోనూ గెలిచి సత్తా చాటింది. వరల్డ్ కప్ కు ముందు ఇది శుభారంభమేనని అనుకోవాలి. కొత్తగా జట్టులోకి చేరుతున్న వారు రాణిస్తున్నారు. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లో సత్తా చాటుతుండటంతో భారత్ అభిమానులు వరస విజయాలను చవి చూస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా శ్రీలంక, న్యూజిలాండ్ ను భారత్ వైట్ వాష్ చేసేసింది.

గిల్ ఆటతీరుతో...
ప్రధానంగా యువ క్రికెటర్ శుభమన్ గిల్ ఆట ముచ్చటేస్తుంది. ప్రతి షాటు సీనియర్లను గుర్తుకు తెస్తుంది. వరస సెంచరీలతో శుభమన్ గిల్ దూసుకుపోతున్నాడు. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మూడో మ్యాచ్ లోనూ శుభమన్ గిల్ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మ, గిల్ లు ఇద్దరూ సెంచరీలు పూర్తి చేయడంతోనే భారత్ కు భారీ స్కోరు లభించింది. 385 స్కోరు ను ఛేదించేందుకు న్యూజిలాండ్ కష్టపడాల్సి వచ్చింది. అయితే బౌలర్లు కూడా రాణించడంతో 90 పరుగుల తేడాతో భారత్ మూడో వన్డేలోనూ విజయం సాధించింది. వరసగా రెండు టీంలపై క్లీన్ స్వీప్ చేయడం పట్ల క్రీడా విశ్లేషకులు కూడా భారత్ జట్టును మెచ్చుకోలేకపోతున్నారు.
సీనియర్లు విఫలమయినా...
చివరి వన్డేలో షమి, సిరాజ్ లను పక్కన పెట్టి ప్రయోగం చేసినా భారత్ కు విజయం దక్కింది. కొహ్లి కూడా ఇప్పుడు తిరిగి ఫామ్ లోకి రావడంతో భారత్ జట్టు బలంగానే కనిపిస్తుంది. వన్డేలో సూర్యకుమార్ పెద్దగా రాణించకపోయినా టీ 20లలో మాత్రం అతని అవసరం టీం ఇండియాకు ఎంతో ఉంది. ఇషాన్ కిషన్ వరసగా ఫెయిలవుతూ రావడం దురదృష్టకరం. తనను తాను నిరూపించుకోవాల్సిన సమయంలో ఇషాన్ కిషన్ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ గా చెలరేగి ఆడుతుండటతో భారత్ జట్టు వరస విజయాలను అందుకుంటుంది. మరి త్వరలో న్యూజిలాండ్ తో జరిగే టీ 20 మ్యాచ్ లలో ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News