హరీ....కృష్ణా....వీరి వేదన ఎవరికీ పట్టదా..?

Update: 2018-09-01 07:51 GMT

వారంతా నిరుపేద యువకులు. ఉపాది కోసం అప్పోసప్పో చేసి కెమెరాలు కొనుక్కుని ఫోటోగ్రఫీని వృత్తిని కొనసాగిస్తున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదం ఆ యువకులను రోడ్డున పడేసింది. హరికృష్ణ వాహనం ఢీకొన్న మరో వాహనం లో ఉన్న యువకులు అద్రుష్టవాత్తూ ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డా... ప్రమాదంలో లక్షల విలువ చేసే కెమెరాలు,కారు ధ్వంసమై ఉపాధి కోల్పోయిన యువకులు ధీనంగా ఉన్నారు. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న వార్తతో సినీ పరిశ్రమ అటు రాజకీయ రంగాన్ని కలచివేసింది. నందమూరి అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ, రాజకీయ ప్రముఖులు హరికృష్ణకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారికంగా అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే, హరిక్రిష్ట వాహనం కారణంగా తప్పు లేకున్నా ప్రమాదం బారినపడ్డ యువకులను ఇప్పుడు పట్టించుకునే నాధుడే లేడు. ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా... వారిని ఆధుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

ఉపాధి కోల్పోయి... ఆసుపత్రిలో...

నల్గొండ జిల్లా అనపర్తి వద్ద 2323 నంబరు హరికృష్ణ కారు అదుపుతప్పి పల్టీ కొట్టి పక్క నుంచి వెళుతున్న 9000 నంబరు గల మరోకారును ఢికొట్టింది. ఈ కారులో హైదరాబాద్ కు చెందిన శివ, భార్గవ్, ప్రవీణ్, మరోవ్యక్తి ఉన్నారు. ఫోటోగ్రాఫర్లైన వీరు చెన్నైలో ఓ ప్రోగ్రాంకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. ఈ ప్రమాదంలో కారుతో పాటు వారి కెమెరాలు మరియు ఫొటోగ్రఫీకి సంబంధించిన వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నలుగురుని కూడా నార్కట్ పల్లి కామినేని లో చేర్పించారు పోలీసులు. అయితే హరికృష్ణ భౌతికకాయం ఆస్పత్రి నుంచి తరలించాక హాస్పిటల్ యాజమాన్యం వీరిని పట్టించుకోవడం మానేసిందని సదరు యువకులు ఆరోపిస్తున్నారు. గాయాలపాలవ్వడంతో పాటు ఈ యువకుల చేతిలో చిల్లిగవ్వ లేదని, జీవనాధారం కూడా కోల్పోయామని అంటున్నారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో కదలలేని స్థితిలో ఉన్నామనీ,కనీసం వైద్య ఖర్చులు భరించే స్థోమత లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ నందమూరి కుటుంబం కానీ తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Similar News