విచిత్రం..ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు బారులు

Update: 2018-06-01 06:28 GMT

ప్రభుత్వ పాఠశాలలకు రోజురోజుకూ ఆదరణ తగ్గిపోతోంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోనే చేర్పించాలని భావిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో అడ్మీషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు బారులుతీరారు. అదీ పాఠశాల ప్రారంభ రోజునే. హైదరాబాద్ సోమాజిగూడలోని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉంటుంది. అధునాతన భవనం, విద్యార్థులకు అన్ని సదుపాయాలు, అత్యున్నత విద్యా భోదన ఉండటంతో ఈ పాఠశాల మిగతా ప్రభుత్వ పాఠశాలలకు భిన్నం. ఇది ఒక మోడల్ పాఠశాలగా అభివృద్ధి చేశారు. దీంతో ఈ పాఠశాలలో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు.

అడ్మీషన్లు అప్పుడే అయిపోయాయా..?

పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే, అంటే జూన్ 1వ తేదీన అడ్మీషన్ల కోసం బారులు తీరారు. అయితే, అడ్మిషన్లు అయిపోయాయని పాఠశాల సిబ్బంది చెప్పడంతో మొదటి రోజే ఎలా అయిపోతాయని తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప గందరగోళం నెలకొంది. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉంటే తల్లిదండ్రులు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పిస్తారని ఈ సంఘటన రుజువు చేస్తోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలను రాజ్ భవన్ స్కూల్ మాదిరిగా అభివృద్ధి చేస్తే, నిరుపేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించి ఆర్థిక ఇబ్బందులు పడరు.

Similar News