ఫిట్ నెస్ ఛాలెంజ్ పై మోడీకి రాహుల్ సవాల్...

Update: 2018-05-24 10:37 GMT

‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ అంటూ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్ వేదిక వేసిన సవాల్ ఇప్పుడు రాజకీయ సవాల్ గా మారిపోయింది. రాజ్యవర్ధన్ తాను జిమ్ చేస్తున్న వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసి మీరు కూడా ఫిట్ నెస్ వీడియో పోస్ట్ చేయాలని విరాట్ కోహ్లీ, సానియా మిర్జాలకు సవాల్ చేశారు. అయితే ఈ సవాల్ కి స్పందించిన విరాట్ కోహ్లీ తానూ ఫిట్ నెస్ వీడియో తీసి పోస్ట్ చేశాడు. అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిట్ నెస్ సవాల్ వేశారు. దీంతో అసలే ట్విట్టర్ లో చురుగ్గా ఉండే ప్రధాని మోడీ విరాట్ సవాల్ కి స్పందించి త్వరలోనే తన ఫిట్ నెస్ వీడియో పోస్టు చేస్తానని చెప్పాడు. అయితే, ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఈ సవాల్ ను మొదట రాజకీయ సవాల్ గా మార్చారు. రాజకీయాల్లోకి రాకముందు క్రికెటర్ అయిన తేజస్వీ ప్రధాని నరేంద్రమోడీకి ఓ ట్వీట్ చేశాడు. విరాట్ ఫిట్ నెస్ చాలెంజ్ ని అంగీకరించడం పట్ల తనకు ఏమీ అభ్యంతరం లేదని, కానీ తన సవాల్ ను కూడా అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాల కల్పన, రైతులకు సమస్యల నుంచి ఉపశమనం, దళితులు, మైనారిటీలపై దాడులను అరికట్టాలని, ఈ సవాల్ కి స్పందిస్తారా సార్ అని ట్వీట్ చేశారు.

రంగంలోకి రాహుల్ గాంధీ...

అయితే ఇప్పటికే పొలిటికల్ టర్న్ తీసుకున్న ఈ ఫిట్ నెస్ చాలెంజ్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘ డియర్ పీఎం... మీరు విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ ఛాలెంజ్ స్వీకరించడం ఆనందంగా ఉంది. కానీ, నాది కూడా ఒక సవాల్ ఉంది, పెట్రో ధరలు తగ్గించాలి లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసి తగ్గించేలా మీపై ఒత్తిడి తేవాల్సి ఉంటుంది. దీనిపై మీ స్పందన కోసం చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామని ఉత్సాహంగా ఉన్న రాహుల్, మిత్రపక్షం నేతగా ఉన్న తేజస్వీలు ఛాన్స్ దొరకగానే నరేంద్ర మోడీపై విమర్శలకు దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Similar News