హోదాపై ఉసూరుమనిపించారే....!

Update: 2018-10-11 13:15 GMT

ప్రత్యేక హోదా అంశంతో తమకు సంబంధం లేదని 15వ ఆర్ధిక సంఘం టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో అలాంటి నిబంధన ఏది లేదని ఆర్ధిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె. సింగ్ స్పష్టం చేశారు. 15వ ఆర్ధిక సంఘం సభ్యులు రాష్ట్ర పర్యటనలో భాగంగా సచివాలయంలో ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. రాష్ట్ర విభజనతో రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఆదాయం-అప్పుల పంపిణీలో జరిగిన అసమానతలను ముఖ‍్యమంత్రి కమిటీకి వివరించారు.

బాబు ఆరోపణలివే.....

విభజన తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని., ఆర్ధిక సంఘం సిఫార్సుల పేరుతో పార్లమెంటులో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నారని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపుకు 1971 జనాభా లెక్కలే ప్రతిపదికగా తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 2001లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 వరకు పాత జనాభానే పరిగణలోకి తీసుకోవాలన్నారు. 2011 జనాభాను పరిగణలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందన్నారు., 12, 13 ఆర్ధిక సంఘాల ద్వారా నయా రాయపూర్‌ నిర్మాణానికి 4500కోట్ల సాయం లభించిందని., అమరావతికి కనీసం 9వేల కోట్ల గ్రాంటు ఇవ్వాలని కోరారు. ఏపీలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 22వేల కోట్ల సాయం చేయాలని సీఎం విజ్ఞప్తి చేవారు. బుందేల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని కేంద్ర చెప్పినందున రాష్ట్రానిక 24వేల కోట్లు రావాల్సి ఉందన్నారు.

నిధుల అంశం మాత్రం.....

మరోవైపు 15వ ఆర్ధిక సంఘం నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన లభించనట్లు తెలుస్తోంది. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, ఇతర ముఖ్య సదుపాయల ఏర్పాటుకు రూ.1,09,023 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలను ఆర్ధిక సంఘానికి సమర్పించారు. ప్రధాన ప్రాంత అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.39,937 కోట్లు అవసరం కాగా, కేంద్ర ప్రభుత్వం అందులో రూ.2,500 కోట్లు ఇస్తామని చెప్పి, 2014-16 కాలానికి రూ.1500 కోట్లు మాత్రమే అందించిందని., నీతి ఆయోగ్ సూచించినప్పటికీ రూ.1000 కోట్లు విడుదల చేయలేదని వివరించారు. అయితే నిధుల అంశాన్ని పరిశీలిస్తామని మాత్రమే కమిటీ పేర్కొంది.

ఆస్తుల-అప్పుల పంపిణీ......

ఆర్దిక సంఘంతో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలను కమిటీ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆస్తులు-అప్పుల పంపిణీ లోపాలను సీఎం ఎత్తి చూపారు. ప్రత్యేక హోదా., పోలవరం నిధులు, రాజధాని నిర్మాణం విషయాలు ప్రస్తావించారు. జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు లో లోపాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న అంశాలతో తాము సానుభూతితో పరిశీలించినా తమ పరిధిలో మాత్రమే తాము పనిచేయగలుగతామని ఫైనాన్స్‌ కమిటీ ఛైర్మన్ స్పష్టం చేవారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని రాష్ట్రాలలో పర్యటిస్తామని., దేశంలో ఎక్కడా లేని రాజధాని అమరావతిలో నిర్మితమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలనలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఏపీ ప్రభుత్వం కొత్త విజయాలు సాధిస్తోందని దేశ స్థూల ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ పోషిస్తోన్న పాత్రను ఆర్థిక సంఘము గుర్తించిందన్నారు.

ఆర్థిక సంఘం పాత్ర ఉండదన్న.....

14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడం లేదనే అంశాన్ని 15వ ఆర్ధిక సంఘం ఛైర్మన్‌ ఖండించారు. ఫైనాన్స్‌ కమిటీలు ఎలాంటి సూచన చేయలేదని స్పష్టం చేశారు. దేశంలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా మాత్రమే ప్రత్యేక తరగతి హోదాను అమలు చేశారని చెప్పారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కొన్ని రాష్ట్రాలకు అమలు చేశారని., అందులో ఆర్థిక సంఘం పాత్ర., ప్రమేయం ఏ మాత్రం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కూడా 15వ ఆర్థిక సంఘం కూడా దానిలో చేయగలిగింది ఏమి లేదన్నారు. 15వ ఆర్థిక సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కూడా ఆ ప్రస్తావన లేదని కేంద్రం ఎందుకు అలా చెప్పిందో తమకు తెలియదన్నారు. మరోవైపు 15వ ఆర్ధిక సంఘం ఎదుట రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని సిపిఐ., సిపిఎం., వైసీపీలు డిమాండ్ చేశాయి.

విపక్షాల ఆరోపణలు...

అదే సమయంలో రాజధాని ప్రాంతంలో రైతుల హక్కులకు విఘాతం కలుగుతోందని వైసీపీ., సీపీఎం., సీపీఐలు ఆరోపించాయి. అమరావతి నిర్మాణం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా జరుగుతోందని సిపిఎం ఆరోపించింది. కమిటీ ఎదుట మాట్లాడే క్రమంలో సిపిఐ నేతలపై ఆర్ధిక సంఘం అధికారులు అసహనం వ్యక్తం చేశారు. బలవంతపు భూసేకరణ వల్ల రైతులు నష్టపోయారని., స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా పోయాయని ఆరోపించారు. మరోవైపు ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్లే రాష్ట్రానికి నష్టం కలుగుతోందని బీజేపీ ప్రతినిధులు ఆర్ధిక సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రాధాన్యత రంగాలను విస్మరించి రాష్ట్రంలో నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో అభివృద్ధి కుంటుపడుతోందని బీజేపీ ఆరోపించింది. ముఖ్యమంత్రి విమానాల్లో తిరుగుతూ అధర్మ పోరాటాలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల వల్ల పన్నుల ఆదాయం పంపిణీ వల్ల రాష్ట్రానికి మరింత నిధులు వస్తున్నాయని., క్రమశిక్షణ పాటించని రాష్ట్రాలపై చర్యలు తీసుకునే అధికారం ఆర్ధిక సంఘానికి ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తరపున హాజరైన వైసీపీ ఏపీకి తక్షణ సాయం కింద 60వేల కోట్ల సాయం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హెదా హామీని అమలు చేయాలని ఆ పార్టీ ప్రతినిధి ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా తమకు సంబంధం లేని అంశమని., నిధుల కేటాయింపు కూడా అన్ని రాష్ట్రాలు లేవనెత్తే అంశాలను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తామని మాత్రమే ఆర్ధిక సంఘం తేల్చి చెప్పింది.

Similar News