నా డెడ్ బాడీ చూస్తారు

Update: 2018-06-28 13:08 GMT

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేయాలని తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ కు గురువారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ఫోన్ చేశారు. అంతకుముందు టీడీపీ ఎంపీలు ఆయనను కలిసి ఉక్కు కర్మాగారానికి సంబంధించిన వివరాలు, ముఖ్యమంత్రి లేఖను అందజేశారు. దీంతో ఆయన సీఎం రమేష్ కి ఫోన్ చేసి దీక్ష విరమించాలని కోరారు. అన్ని విషయాలనూ ఎంపీలతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. అయితే స్పష్టమైన హామీ ఇచ్చేవరకు దీక్ష విరమించనని రమేశ్ తేల్చిచెప్పారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే తన డెడ్ బాడీని చూడాల్సివస్తుందని చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రజల సెంటిమెంట్ అని, ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులూ కల్పిస్తుందని రమేశ్ చెప్పారు. తమకు క్రెడిట్ అవసరం లేదని, ఫ్యాక్టరీ ఏర్పాటుచేసి ఆ క్రెడిట్ ను కేంద్రమే తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రధానితో మాట్లాడి సాద్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయితే, కేంద్రమంత్రితో సంభాషణను సీఎం రమేష్ స్పీకర్ ఆన్ చేసి, మైక్ పెట్టి మరీ ప్రజలకు వినిపించడం గమనార్హం.

Similar News