మళ్లీ చిక్కుల్లో చింతమనేని....!

Update: 2018-09-21 02:05 GMT

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. వరుస వివాదాలతో ఆయన పార్టీకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఐఎంఎల్ డిపో హమాలీ మేస్త్రీ జాన్ పై దాడి చేసిన కేసులో చింతమనేనితో పాటు ఆయన గన్ మెన్లు, అనుచరులపైనా ఏలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక హమాలీని పని నుంచి తొలిగించినందుకు జాన్ ను తన ఇంటికి పిలిపించుకుని చింతమనేని కొట్టి, కులం పేరుతో దూషించారన్నది వారి ఆరోపణ.

ఫిర్యాదు చేసినా......

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కనీసం పోలీస్ స్టేషన్లో తాము ఇచ్చిన ఫిర్యాదుకు రశీదు కూడా పోలీసులు ఇవ్వలేదని జాన్ ఆరోపిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు చింతమనేనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగాయి. జిల్లా ఎస్పీని కలసి తమ గోడును విన్పించాయి. అప్పటికీ సాధ్యం కాకపోవడంతో జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజాసంఘాలు ఆందోళన చేయాలని నిర్ణయించుకోవడంతో చింతమనేని అతని అనుచరులపై పోలీసులు ఐసీపీ 323 సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని మరోసారి వివాదంలో చిక్కుకున్నట్లయ్యింది.

Similar News