రూ.700 కోట్లు వద్దనేశారు..!

Update: 2018-08-23 11:22 GMT

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రానికి ఆదుకునేందుకు విదేశాలు చేస్తున్న సాయం తీసుకోవడం లేదని తేల్చేసింది కేంద్రం. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విదేశాంగ విధానం ప్రకారం దేశంలో విపత్తులకు విదేశీల సాయం అంగీకరించడం కుదరదని చెప్పారు. అయితే, ఎన్ఆర్ఐలు, అంతర్జాతీయ సంస్థలు ప్రధానమంత్రి సహాయనిధికి, ముఖ్యమంత్రి సహాయనిధికి సహాయం చెయవచ్చని వెల్లడించారు.

కేరళవాసుల అసంతృప్తి...

కేరళను ఆదుకునేందుకు యూఏఈ రూ.700 కోట్లు, ఖతార్ రూ.35 కోట్లు, ద్వీప దేశం మాల్దీవులు రూ.35 లక్షలు విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. వరదల వల్ల కేరళకు సుమారు రూ.20 వేల కోట్ల నష్టం కలిగిందనే అంచనాలు ఉన్నాయి. అయితే, విదేశాల సహాయం తీసుకోకున్నా అన్నివిధాలుగా కేరళ రాష్ట్రాన్ని పునరుద్ధరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని రవీష్ కుమార్ ప్రకటించారు. అయితే, కేంద్రం నిర్ణయం పట్ల కేరళవాసులు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. విదేశీ సహాయం తీసుకునేందుకు ప్రధానిని కలిసి ఒప్పించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ భావిస్తున్నారు.

Similar News